పీఎం విశ్వకర్మను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Mar 05 , 2025 | 11:31 PM
దేశంలో పేదరికం నిర్మూలనకు ప్రధాన మంత్రి మోదీ పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని నిరుద్యోగులు, కులవృత్తుల వారు లబ్ధి పొందాలని చెప్పారు.

అవగాహన సదస్సులో పాలమూరు ఎంపీ డీకే అరుణ
మహబూబ్‌నగర్ టౌన్, మార్చి 5(ఆంధ్రజ్యోతి): దేశంలో పేదరికం నిర్మూలనకు ప్రధాన మంత్రి మోదీ పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని నిరుద్యోగులు, కులవృత్తుల వారు లబ్ధి పొందాలని చెప్పారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పీఎం విశ్వకర్మ పథకం అవగాహన సదస్సుకు ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ పథకం ద్వారా పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని అన్నారు. 18 రకాల వృత్తుల వారికి శిక్షణ ఇచ్చి, రుణాలు ఇప్పించి, స్వయం ఉపాధి పొందేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. త్వరలో నారాయణపేటతో పాటు మండల కేంద్రాల్లో కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రతీ ఒక్కరు ఈ పథకాన్ని ఉపయోగించుకొని, ఆర్థికంగా ఎదగాలన్నారు. ఎమ్యెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులైన యువతీ యువకులు అవకాశాలను సద్వినియోగం చేసుకొని, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని అ న్నారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకుల మేనేజ ర్లు, అధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి
అవగాహన సదస్సు అనంతరం ఎంపీ అరుణ విలేకరులతో మాట్లాడారు. పీఎం విశ్వరకర్మ యోజన పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారు అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దరఖాస్తు చేసుకున్నా శిక్షణ ఇవ్వకపోవడం వల్ల సర్టిఫికెట్లు లేక బ్యాంకర్లు కూడా రుణాలు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని అర్హులైన వారికి రుణాలు అందించేందుకు అధికారులను సమాయత్తం చేయాలన్నారు. పథకం కింద వందలాది మంది దరఖాస్తు చేసుకున్నారని, బ్యాంకర్లు ఆలస్యం చేయకుండా చూడాలన్నారు. కనీసం 25 మంది గ్రూప్‌గా ఏర్పడి, శిక్షణ పొందాలన్నారు. చిన్న వ్యాపారాలకు కూడా రుణాలు ఇస్తారని, మొదట్లో రూ.50 వేల రుణం నుంచి రూ.3 లక్షల రుణం వరకు ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో పరిశ్రమల అధికారులు, బ్యాంకర్లు, కులవృత్తుల వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.