పరేషాన్‌లో పల్లి రైతులు
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:40 PM
పల్లీ రైతులు పరేషాన్‌లో ఉన్నారు.

- తెగుళ్లతో తగ్గిన దిగుబడి
- పెరిగిన పెట్టుబడి ఖర్చులు
- పడిపోయిన ధరలు
- జిల్లాలో లక్షా 20 వేల 280 ఎకరాలలో వేరుశనగ సాగు
- అచ్చంపేట మార్కెట్‌లో క్వింటాల్ ధర రూ.7107
ఈ ఏదాడి యాసంగిలో వేరుశనగ సాగుచేసిన రైతుల ఆశలు గల్లంతయ్యాయి. గతేడాది మాదిరిగా దిగుబడి, ధర ఉంటే కొంత లాభాలు పొందవచ్చని ఆశించారు. కానీ వాతావరణం లో మార్పుతో పంట మొదటి నుంచే తెగుళ్ల బారిన పడింది. తెగుళ్ల నుంచి పంటను కాపాడుకునేందుకు వివిధ రకాల మందులు పిచికారి చేశారు. దీంతో పెట్టుబడి ఖర్చులు పెరిగినా దిగుబడి మాత్రం తగ్గిపోయింది. రాత్రింబవళ్లు కష్టపడితే వచ్చిన పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే వ్యాపారులు తేమశాతం పేరుతో ధరలు తగ్గించడంతో అప్పుల పాలవుతున్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే వరికి మద్దతు ధర ప్రకటించినట్లుగా వేరుశనగకు కూడా మద్దతు ధర ప్రకటించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అచ్చంపేట, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): పల్లీ రైతులు పరేషాన్‌లో ఉన్నారు. తెగుళ్లు అధికమవడంతో ఈ ఏడాది దిగుబడి కూడా తగ్గింది. ధరలు కూడా పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జిల్లాలో ఈ ఏడాది యాసంగిలో 62,134 మంది రైతులు 1,20,280 ఎకరాలలో వేరుశనగ సాగు చేశారు. ఇప్పుడిప్పడే పల్లి మార్కెట్ వస్తోంది. గతేడాది క్వింటాల్ ధర దాదాపు రూ.9 వేలపైనే ఉన్నది. అయినా మార్కెట్లో వ్యాపారులు, సిబ్బంది ఏకమై రైతులను నిండా ముంచుతున్నారని అప్పటి మార్కెట్ చైర్మన్‌పై వేరుశనగ రైతులు చేసిన విషయం విధితమే. అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌లో ఈ నెల 17 నుంచి 22 వరకు 1,461 మంది రైతులు, 16,510 క్వింటాళ్ల వేరుశనగను విక్రయించారు. బుధవారం వ్యవసాయ మార్కెట్‌లో గరిష్ఠ ధర క్వింటాలుకు రూ.7,107 పలికింది. కనిష్ఠ ధర రూ.4,510 పలికింది. మోడల్ ధర రూ.6,069, వ్యాపారులు నిర్ణయించారు. అరుకాలం కష్టపడి పడించిన రైతులకు మద్దతు ధర రాకపోవడంతో చాలా మంది రైతులు నిరాశకు లోనవుతున్నారు.
తేమశాతం పేరుతో భారీ మోసం
రైతులు పడించిన వేరుశనగ పంటను వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారులు తేమశాతం పేరుతో భారీ మోసానికి పాల్పడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది దిగుబడి అంతంత మాత్రంగా ఉన్నా.. ధరలు కూడా భారీగా తగ్గించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తేమశాతం 70 నుంచి 71 మాత్రమే వస్తుందని వ్యాపారులు అంటుంటే కొంతమంది రైతులు 70 శాతానికి పైగా వస్తున్నా వ్యాపారులు మాత్రం తక్కువ ధర వేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.