Share News

నిర్మలమ్మా.. కరుణించమ్మా

ABN , Publish Date - Jan 31 , 2025 | 11:44 PM

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో శనివారం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. బడ్జెట్‌లో పలు ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై ఉమ్మడి పాలమూరు ప్రజలు ప్రతీసారి భారీగా ఆశలు పెట్టుకుంటున్నప్పటికీ.. నిరాశే ఎదురవుతోంది. ఈసారైనా పలు ప్రాజెక్టులు, నూతన అభివృద్ధి పనులకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారనే భావనలో ప్రజలు ఉన్నారు.

నిర్మలమ్మా.. కరుణించమ్మా

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం

రెండు రైల్వేలైన్లకు నిధులపై ఉమ్మడి జిల్లావాసుల ఆశలు

గద్వాల-డోర్నకల్‌, కృష్ణా-వికారాబాద్‌ ఎఫ్‌ఎల్‌ఎస్‌ పూర్తి

ఈ రెండు లైన్లకు రూ.7,526 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు

కేంద్రియ, నవోదయ విద్యాలయాల కోసం ప్రతిపాదనలు

జాతీయ రహదారులు, శ్రీశైలం ఎలివేటెడ్‌ కారిడార్‌కు నిధులు అవసరం

మహబూబ్‌నగర్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో శనివారం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. బడ్జెట్‌లో పలు ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై ఉమ్మడి పాలమూరు ప్రజలు ప్రతీసారి భారీగా ఆశలు పెట్టుకుంటున్నప్పటికీ.. నిరాశే ఎదురవుతోంది. ఈసారైనా పలు ప్రాజెక్టులు, నూతన అభివృద్ధి పనులకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారనే భావనలో ప్రజలు ఉన్నారు. ప్రధానంగా పాలమూరు ప్రజలు కృష్ణా-వికారాబాద్‌, గద్వాల- డోర్నకల్‌ రైల్వేలైన్లకు నిధుల కేటాయింపును కోరుతున్నారు. ఇప్పటికే ఆ రైల్వేలైన్లకు సంబంధించి ఫైనల్‌ లొకేషన్‌ సర్వే(ఎ్‌ఫఎల్‌ఎస్‌) పూర్తి చేయగా, అంచనాలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు కూడా పూర్తి చేశారు. గత బడ్జెట్‌ సమయానికే ఇవి అందుబాటులోకి వచ్చినప్పటికీ.. ఆ సమయంలో కేటాయింపులు దక్కలేదు. అలాగే కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు, సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు, గద్వాల జిల్లాలో చేనేత పార్కు, అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠం అయిన జోగుళాంబ ఆలయ అభివృద్ధి, జాతీయ రహదారులు, పంటలకు గిట్టుబాటు ధరలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు, వేతన జీవులకు ఆదాయ పన్నులో ఊరట లభించాలని ఆశిస్తున్నారు. అలాగే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా లేదా కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు చేయాలనే డిమాండ్‌ ఉంది. 2014 ఎన్నికల సమయంలో ఈ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్రమోదీ జాతీయ హోదా ఇస్తామని ప్రకటించారు. తర్వాత దాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రీడిజైన్‌ చేసినందునే జాతీయ హోదా ఇవ్వలేదని స్థానిక బీజేపీ నాయకులు చెబుతూ వచ్చారు. అయితే అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టుకు నిధుల అవసరం చాలా ఉందనే చెప్పవచ్చు.

రెండు రైల్వే లైన్లపై ఆశలు..

పాలమూరు ఉమ్మడి జిల్లాలో కృష్ణా-వికారాబాద్‌, గద్వాల-డోర్నకల్‌ రైల్వేలైన్లకు ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. ఎంపీలు డీకే అరుణ, డాక్టర్‌ మల్లు రవి కూడా ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు కూడా ఇచ్చారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌ మీదుగా రాయచూరుకు రైల్వేలైన్‌ ఉంది. ఈ దూరం దాదాపు 183 కిలోమీటర్లు. కాగా, ప్రతిపాదనలో ఉండి... ఎఫ్‌ఎల్‌ఎస్‌ పూర్తి చేసుకున్న కృష్ణా- వికారాబాద్‌ రైల్వేలైన్‌ వల్ల ఆ దూరం 122 కిలో మీటర్లకు తగ్గుతుంది. వెనుకబాటులో ఉన్న కొడంగల్‌, నారాయణపేట, మక్తల్‌ ప్రాంతాల్లో సిమెంట్‌ పరిశ్రమలు ఏర్పాటై.. పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది. దీనికి రూ.2,196 కోట్లతో అంచనాలు రూపొందించి, ప్రభుత్వానికి అందించారు. పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో కూడా అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ అభ్యర్థులు ఈ రైల్వేలైన్‌ను ఎజెండాగా చేసుకున్నారు. అలాగే గద్వాల- డోర్నకల్‌ రైల్వేలైన్‌కు రూ.7.40 కోట్లతో ఎఫ్‌ఎల్‌ఎస్‌ పూర్తి చేయగా.. మొత్తం 296 కిలోమీటర్ల దూరానికి రూ.5,330 కోట్లు అంచన వేశారు. గతంలో ఉన్న గద్వాల- మాచర్ల రైల్వేలైన్‌ అలైన్‌మెంట్‌ను గద్వాల-డోర్నకల్‌గా మార్చారు. ఈ సర్వే కూడా పూర్తయ్యి దాదాపు సంవత్సరం అవుతోంది. గత బడ్జెట్‌లో నిధులు కేటాయించ లేదు. అలాగే సికిందరాబాద్‌-మహబూబ్‌నగర్‌ వరకు ఇప్పటికే డంబ్లింగ్‌ పనులు పూర్తికాగా.. ఇటీవల ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా మహబూబ్‌నగర్‌- కర్నూలు డంబ్లింగ్‌కు కూడా శంకుస్థాపన చేశారు. వాటికి నిధులు కేటాయించాల్సి ఉంది.

జాతీయ రహదారులపై ఆశలు..

ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాలో హైదరాబాద్‌- శ్రీశైలం, చించోలి, 44వ జాతీయ రహదారులు అందుబాటులో ఉన్నాయి. ఇంకా దూరభారం తగ్గించడానికి భూత్పూరు- శిరిగిరిపాడు, వనపర్తి- మంత్రాలయం, గద్వాల- రాయిచూర్‌ జాతీయ రహదారుల ఏర్పాటు ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే హైదరాబాద్‌- బెంగళూరు మధ్య ఉన్న జాతీయ రహదారి 44పై ఇప్పటికే వాహనాల రాకపోకల శాతం భారీగా పెరిగింది. దాన్ని నాలుగు లైన్ల నుంచి ఎనిమిది లైన్లుగా మార్చాలని ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే గత బడ్జెట్‌లో పెట్టిన హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారిపై పారిశ్రామిక కారిడార్‌కు ఇప్పటివరకు మోక్షం లభించలేదు. శ్రీశైలం వెళ్లే దారిలో వన్యప్రాణులకు ఇబ్బంది కలుగకుండా ఉండటం కోసం ఎలివేటెడ్‌ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని డీపీఆర్‌ కూడా సిద్ధం కాగా, భారీగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ప్రతీ జిల్లాకు ఒక కేంద్రీయ విద్యాలయం, నవోదయ పాఠశాల ఏర్పాటకు గతంలో నుంచి ప్రతిపాదనలు ఉన్నాయి. ఇటీవల మహబూబ్‌నగర్‌కు మాత్రమే నవోదయ పాఠశాల మంజూరైంది. నారాయణపేటలో సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు పట్టాలు ఎక్కలేదు. వీటన్నింటికీ ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని పాలమూరు ప్రజలు కోరుతున్నారు. మరి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పద్దు పాలమూరు వాసుల్లో ఆశలు నింపుతుందా? లేదా ఎప్పటిలాగే నిరాశనే మిగిలిస్తుందా? అనేది చూడాలి.

Updated Date - Jan 31 , 2025 | 11:44 PM