Share News

జనరల్‌ ఆసుపత్రికి ఎంఆర్‌ఐ

ABN , Publish Date - Feb 16 , 2025 | 11:37 PM

ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్న ఎంఆర్‌ఐ సేవలు జనరల్‌ ఆసుపత్రిలో అందుబాటులోకి రానున్నాయి.

జనరల్‌ ఆసుపత్రికి ఎంఆర్‌ఐ
ఎంఆర్‌ఐ యంత్రం ఏర్పాటుకు గదులు పరిశీలిస్తున్న సూపరింటెండెంట్‌

- జనరల్‌ మెడిసిన్‌ విభాగం వైపు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు

- ఈనెల 21న టెండరు దాఖలుకు చివరి అవకాశం

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం), ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి) : ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్న ఎంఆర్‌ఐ సేవలు జనరల్‌ ఆసుపత్రిలో అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లా పేద ప్రజలకు ఆర్థిక భారం తగ్గనుంది. ఎంఆర్‌ఐ యంత్రాన్ని జనరల్‌ మెడిసిన్‌ విభాగం వైపు వెనకభాగంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ఇంజనీరింగ్‌, ఆయా యంత్రం కంపెనీల ప్రతినిధులు అనువైన స్థలాన్ని పరిశీలించారు. అయితే యంత్రం కొనుగోలుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఈనెల 21 వరకు టెండరు దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. అన్ని పూర్తయితే మార్చి నెలాఖరు నాటికి ఎంఆర్‌ఐ సేవలు అందబాటులోకి రానున్నాయి. కాగా ఈ యంత్రం విలువ రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అత్యాధునిక పరిజ్ఞానంతో 3.0 టెస్లా సామర్థ్యం కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయా కంపెనీల ప్రతినిధులు, బిడ్డర్లు టెండర్లు దాఖలు చేశారు. ఈనెల 21 వరకు టెండర్లు దాఖలు చేసేందుకు చివరి తేదీగా నిర్ణయించారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే ప్రభుత్వం నిధులు మంజూరు చేసే అవకాశం ఉంది.

జనరల్‌ మెడిసిన్‌ విభాగం ప్రాంతంలో ఏర్పాటు

ఎంఆర్‌ఐ యంత్రం ఏర్పాటు చేయాలంటే దానికి అనుకూలమైన స్థలం ఉండాలి. ఇందుకోసం ముందుగా రేడియాలజీ హబ్‌ను అనుకున్నారు. అంతేకాకుండా ఏర్పాటు కోసం కొన్ని నిర్మాణ పనులు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎంత ఖర్చు అవుతుందనే విషయంపై టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అధికారులతో ప్రతిపాదనలు తయారు చేయించారు. కానీ ఖర్చు దాదాపు రూ.1.50 కోట్ల వరకు అవుతుండడంతో దాన్ని క్యాన్సల్‌ చేశారు. మళ్లీ జనరల్‌ మెడిసిన్‌ విభాగం ప్రాంతంలో ఓ పెద్ద హాలును చూశారు. ఇందులో ఏర్పాటు చేస్తే ఖర్చు తక్కువ అవుతుందని భావించి అక్కడే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే విప్రో కంపెనీకి చెందిన ప్రతినిధులు, ఇంజనీర్లు వచ్చి స్థలాన్ని కూడా పరిశీలించారు. వారు కూడా అక్కడే ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు.

తీరనున్న ఆర్థిక భారం

ఉమ్మడి జిల్లాల్లో జనరల్‌ ఆసుపత్రులు, మెడికల్‌ కళాశాలలు అయినప్పటికీ మెరుగైన వైద్యం కోసం పాలమూరుకే వస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాస్‌రెడ్డి ఎంఆర్‌ఐ యంత్రాన్ని ఖచ్చితంగా తేవాలని పట్టుబట్టారు. ఈ మేరకు ప్రభుత్వంతో మాట్లాడి మంజూరు చేయించారు. అయితే జనరల్‌ ఆసుపత్రిలో ఈ యంత్రం అందుబాటులోకి వస్తే నిరుపేదలకు ఆర్థిక భారం తగ్గుతుంది. బయటి డయాగ్నోస్టిక్‌ సెంటర్లలో ఎంఆర్‌ఐ కోసం రూ.6 వేల వరకు వసూలు చేస్తున్నారు. జనరల్‌ ఆసుపత్రిలోకి ఎంఆర్‌ఐ సేవలు వస్తే ఎంతోమంది నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో అన్ని రకాల యంత్రాలు ఉన్నాయి.

మార్చి నెలాఖరు నాటికి అందుబాటులోకి సేవలు..

టెండర్ల ప్రక్రియ పూర్తయితే టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ద్వారా యంత్రం జిల్లాకు చేరుతుంది. అది చేరిన వెంటనే ఇన్‌స్టాలేషన్‌ ప్రక్రియను వేగవంతం చేస్తాం. అన్ని పూర్తిచేసి మార్చి నెలాఖరు నాటికి ఎంఆర్‌ఐ సేవలు అందుబాటులోకి తెస్తాం.

- డాక్టర్‌ సంపత్‌కుమార్‌ సింగ్‌, జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌

Updated Date - Feb 16 , 2025 | 11:37 PM