విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలి
ABN , Publish Date - Jan 31 , 2025 | 11:08 PM
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఎంపీడీవో రహమతుద్దీన్ అన్నారు.

- ప్రభుత్వ పాఠశాల తనిఖీల్లో అధికారులు
- మధ్యాహ్న భోజనం పరిశీలన
మాగనూరు/కోస్గి రూరల్/ కృష్ణ, జనవరి 31 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఎంపీడీవో రహమతుద్దీన్ అన్నారు. శుక్రవారం మాగనూరు మండలంలోని నేరడుగమ్ము గ్రామంలోని ప్రాథమిక ఉర్దూ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన వంటకాలను పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం పాఠశాలలో రికార్డులను పరిశీలించారు. విద్యార్థులు డ్రాప్ అవుట్ కాకుండా, ప్రతీరోజు పాఠశాలకు వచ్చే విధంగా చూడాలని ఉపాధ్యాయులను కోరారు. మాగనూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఎంపీవో విజయలక్ష్మి పరి శీలించారు. హెచ్‌ఎం రాజిరెడ్డి, పంచాయతీ కా ర్యదర్శి తిమ్మప్ప తదితరులున్నారు.
అదేవిధంగా, కోస్గి మండలం నాచారం గ్రామంలోని కస్తూర్భాగాంధీ విద్యాలయాన్ని తహసీల్దార్ శ్రీనివాసులు తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆయన భోజనానికి నాణ్యమైన వంట సరుకులు వాడాలని ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. విద్యార్థులకు చదువుతో పాటు పౌష్టికాహారం కూడా ముఖ్యమేనన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. కార్యక్రమంలో కేజీబీవీ ఎస్‌వో స్వాతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
కృష్ణ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తహసీల్దార్ బి.వెంకటేష్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంట గదులు, వంటలను పరిశీలించి, ఏజెన్సీ నిర్వాహకులకు సూచనలు చేశారు. బియ్యంలో రాళ్లు ఉంటే రేషన్ దుకాణానికి తిరిగి పంపాలన్నారు.