Share News

వచ్చేనెల ఏడు నుంచి మన్యంకొండ బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Jan 28 , 2025 | 11:31 PM

మన్యంకొండ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి మార్చి 16వ తేదీ వరకు లక్ష్మీ వేంకటేశ్వర స్వామి జాతర ఉత్సవాలను నిర్వహించనున్నట్లు చెప్పారు.

వచ్చేనెల ఏడు నుంచి మన్యంకొండ బ్రహ్మోత్సవాలు
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

వేలాదిగా తరలిరానున్న భక్తులు

అన్ని ఏర్పాట్లు చేయాలి

అధికారులతో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సమీక్ష

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): మన్యంకొండ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి మార్చి 16వ తేదీ వరకు లక్ష్మీ వేంకటేశ్వర స్వామి జాతర ఉత్సవాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఏర్పాట్లపై మంగళవారం ఆయన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్పీ డి.జానకి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతా్‌పతో కలిసి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణలోనే చిన్న తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. గత సంవత్సరం లోటుపాట్లు తిరిగి జరుగకుండా, భక్తులు అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. తాగునీరు, శానిటేషన్‌, టాయిలెట్లు, బందోబస్తు, రద్దీ నియంత్రణ, పార్కింగ్‌ వంటి సౌకర్యాలను కల్పించాలని చెప్పారు.

నిర్వహణకు కమిటీలు

బ్రహ్మోత్సవాల నిర్వహణకు మానిటరింగ్‌, వాటర్‌ అండ్‌ శానిటేషన్‌, ఫుడ్‌, ఫైనాన్స్‌, ఫెస్టివల్‌, లా అండ్‌ ఆర్డర్‌ కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. జాతరకు ముఖ్యమంత్రి, వీఐపీలు వచ్చే అవకాశం ఉంటుందని, అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. వివిధ శాఖల అధికారులు అప్పగించిన విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. కొండ మీదకు మినీ ఆర్‌టీసీ బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. రవాణ శాఖ అధికారులతో తనిఖీ చేయించి, ఫిట్‌నెస్‌ సరిగా ఉన్న బస్సులనే అనుమతించాలన్నారు. రోడ్డు మధ్యలో దుకాణాలను ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్‌, స్థానిక సంస్థ అదనపు కలెక్టర్‌ క్షేత్ర స్థాయి పర్యటన చేసి ఏర్పాట్లను పరిశీలించాలని కోరారు. ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ పోలీస్‌ శాఖ తరపున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ రాజు, మన్యం కొండ దేవస్థానం చైర్మన్‌ అలహరి మధుసూదన్‌, డీఆర్‌వో కేవీవీ రవికుమార్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2025 | 11:31 PM