నులి పురుగులను నిర్మూలిద్దాం
ABN , Publish Date - Feb 03 , 2025 | 11:31 PM
అధికారులు సమన్వయంతో కృషి చేసి నులి పురుగుల నిర్మూలనకు కృషి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.

- కలెక్టర్ విజయేందిర బోయి
- 10న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి) : అధికారులు సమన్వయంతో కృషి చేసి నులి పురుగుల నిర్మూలనకు కృషి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. ఈనెల 10న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒక సంవత్సరం పిల్లలు మొదలుకొని 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా ఆల్బెండ జోల్ మాత్రలు ఇవ్వాలన్నారు. ఆ రోజు మాత్రలు ఇవ్వని వారికి తిరిగి ఫిబ్రవరి 17న ఇవ్వాలని ఆదేశించారు. ఈ మాత్రలతో పిల్లల్లో నులి పురుగుల సమస్య, రక్తహీనత, బుద్ధి మాంద్యం, చదువుల పట్ల ఏకాగ్రత పెంపొందుతుందన్నారు. ఈ విషయంపై గ్రామాల్లో టాం టాం వేయించాలని డీపీవోను ఆదేశించారు. డీఎంహెచ్‌వో కృష్ణ మాట్లాడుతూ జిల్లాలో ఒకటి నుంచి 19 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలు 2,59,292 మంది ఉన్నారని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు, డీఈవో ప్రవీణ్‌కుమార్, మహిళ, శిశుసంక్షేమ శాఖ అధికారిణి జరీనా బేగం, డీపీఓ పార్థ సారథి, డీఆర్డీవో నర్సింహులు, వైద్య ఆరోగ్య శాఖ మాస్ మీడియా అధికారిణి ముంజుల పాల్గొన్నారు.
ఫిర్యాదుల పరిష్కారం వేగవంతం చేయండి
ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ప్రతీ సోమవారం వస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ప్రజావాణికి 63 ఫిర్యాదులు అందాయి. జడ్పీసీఈవో వెంకట్‌రెడ్డి, డీఆర్డీఏ నర్సింహులు, ఆర్డీవో నవీన్, మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.