Share News

కార్పొరేట్లకు వ్యతిరేకంగా పోరాడుదాం

ABN , Publish Date - Feb 23 , 2025 | 11:18 PM

కేంద్రం కార్పొరేట్లకు అనుకూలంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టిందని, ఇందుకు గ్రామ స్థాయి నుంచే కార్పొరేట్లకు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి పిలుపునిచ్చారు.

కార్పొరేట్లకు వ్యతిరేకంగా పోరాడుదాం
మాట్లాడుతున్న సీఐటీయూ రాష్ట్ర కార్యరద్శి జయలక్ష్మి

- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి

పాలమూరు, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి) : కేంద్రం కార్పొరేట్లకు అనుకూలంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టిందని, ఇందుకు గ్రామ స్థాయి నుంచే కార్పొరేట్లకు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా సెమినార్‌ నిర్వహించారు. దీప్లానాయక్‌, పి.జగన్‌ అధ్యక్షత వహించగా, జయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికుల కనీస వేతనాల పెంపుదలకు, ఇతర శ్రామిక ప్రజల ఆదాయాల పెంపుకోసం బడ్జెట్‌లో ఎలాంటి ప్రతిపాదనలు లేవన్నారు. పైగా యాజమాన్యాలు తెచ్చిన లేబర్‌ కోడ్ల అమలు జరపాలని సరళీకృత విధానాలు మరింత వేగవంతం చేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారన్నారు. 12 గంటల పని విధానంపై కార్పొరేట్లు పదేపదే మాట్లాడుతున్నారని, క్షేత్ర స్థాయిలో సేవలు అందించే ఆశ, అంగన్‌వాడీలు, వీవోఏలు, మధ్యాహ్న భోజనం తదితర స్కీం వర్కర్ల అవసరాలకు అనుగుణంగా కేటాయింపులు చేయలేదన్నారు. కార్మిక సంఘాలు రూ.26 వేల వేతనం ఇవ్వాలని అడుగుతుంటే.. రోజుకు రూ.178 వేతనం సరిపోతుందన్న మోదీ మాటలు విస్మయం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరల నియంత్రణకు విద్యా, వైద్యం నిర్వహణకు నిధులు లేవన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ఽధరలు చట్టబద్దం చేసే ఎమ్మెస్పీ చట్టం తెచ్చేదే లేదని, రైతుల ఆత్మహత్యల నివారణకు బడ్జెట్‌ కేటాయించలేదన్నారు. సబ్సిడీల కోతపెట్టి ధరల పెరుగుదలకు కారణమయ్యే బడ్జెట్‌ను తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. ఉపాధి హామీ చట్టానికి గత బడ్జెట్‌ కన్నా నిధులు తగ్గించి, తీరని నష్టం చేకూర్చిందన్నారు. కార్మిక, కర్షక, వ్యవసాయ కూలీలు ఐక్యతతో ఈ బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ గ్రామ స్థాయి నుంచి పోరాటాలు చేయాలన్నారు. తెలంగాణకు బడ్జెట్‌లో తగిన మోతాదులో నిధులు ఇవ్వాలని కిల్లె గోపాల్‌, కురుమూర్తి అన్నారు. బడ్జెట్‌లో రూ.7 లక్షల కోట్లు కార్పొరేట్లకు కేటాయించి ఆదాని, అంబానీల ప్రభుత్వంగా గుర్తింపు పొందారన్నారు. కార్మికుల పీఎఫ్‌, ఈఎస్‌ఐ, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌, తదితర వాటి కోసం బడ్జెట్‌ రూపొందించలేదన్నారు. విద్య, వైద్యం, బ్యాంకులు, జీవితబీమా సంస్థలను వందశాతం ఎఫ్‌డీఐలను ప్రైవేటీకరించడానికి పూనుకుందని విమర్శించారు. కార్యక్రమంలో వీరాంజనేయులు, గోనెల ఆంజనేయులు, సాధన, మహాలక్ష్మి, భాగ్య, భగవంతు, కేశవులు, సావిత్రి, పద్మ, సాయిలు, విష్ణు పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2025 | 11:18 PM