Share News

పండుగ సాయన్న ఆశయాలు కొనసాగిస్తాం

ABN , Publish Date - Feb 14 , 2025 | 11:31 PM

పాలమూరు వీరుడు పండుగ సాయన్న ఆశయాలను కొనసాగిస్తామని శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాశ్‌ అన్నారు.

పండుగ సాయన్న ఆశయాలు కొనసాగిస్తాం
పండుగ సాయన్న విగ్రహన్ని ఆవిష్కరించిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాశ్‌, ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, యెన్నం శ్రీనివా్‌సరెడ్డి

- శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాశ్‌

- ధర్మపూర్‌లో సాయన్న విగ్రహావిష్కరణ

మహబూబ్‌నగర్‌ రూరల్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : పాలమూరు వీరుడు పండుగ సాయన్న ఆశయాలను కొనసాగిస్తామని శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాశ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం ధర్మపూర్‌లో ఏర్పాటు చేసిన పండుగ సాయన్న విగ్రహాన్ని ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, సీనియర్‌ న్యాయవాది ఎన్‌పీ వెంకటేష్‌, బెక్కం జనర్దన్‌తో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మహాసభలో బండ ప్రకాశ్‌ మాట్లాడుతూ పండుగ సాయన్న పేదల కోసం రాబిన్‌హుడ్‌ అవతారమెత్తి, సేవ చేశారని అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ముదిరాజ్‌లకు మూడు సీట్లు ఇచ్చిందని, గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తామని ఊరిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహించిన బీసీ కులగణనలో బీసీలను 20 లక్షలకుపైగా తక్కువ చూపించి చరిత్రాత్మక తప్పిదం చేసిందన్నారు. తప్పులు సరిదిద్దుకుని న్యాయం చేయకపోతే బీసీల ఆగ్రహానికి గురవుతుందని హెచ్చరించారు. మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ పండుగ సాయన్న జమిందార్లకు, జగిర్‌దార్లకు వ్యతిరేకంగా ఆనాడే పోరాటాలు చేశారని, ఆయన అడుగు జాడల్లో మనం కూడా నడవాలని అన్నారు. అంతకుముందు మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే అందెశ్రీ రచించిన గీతాన్ని తెలంగాణ గీతంగా గుర్తించిందని, అందులో పాలమూరు వీరుడు పండుగ సాయన్నను ప్రస్తావించారని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాడానికి మళ్లీ ఒక కుల గణన చేయాడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. న్యాయవాది బెక్కం జనార్దన్‌ రచించిన పాలమూరు వీరుడు పండుగ సాయన్న పుస్తకాన్ని ప్రముఖులతో కలిసి ఆవిష్కరించారు. కాంగ్రెస్‌ నాయకులు ఎన్‌పీ వెంకటేష్‌, సిరాజ్‌ఖాద్రి, లక్ష్మణ్‌యాదవ్‌, సంజీవ్‌ ముదిరాజ్‌, మల్లు నర్సింహరెడ్డి, బోల యాదయ్య, పెద్ది విజయ్‌ కుమార్‌, మైత్రి యాదయ్య, మెట్టుకాడి ప్రభాకర్‌, ధర్మపూర్‌ నర్సింహరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2025 | 11:31 PM