Share News

జడవరు విడవరు

ABN , Publish Date - Feb 17 , 2025 | 11:35 PM

ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా రోజు రోజుకూ మితిమీరిపోతోంది. గతంలో ఉన్న శాండ్‌ ట్యాక్సీ పాలసీలు ఇప్పుడు అమలు కావడం లేదు. అలాగే ప్రభుత్వం ఇసుక రీచ్‌లకు ప్రత్యేకంగా అనుమతులు ఇవ్వకపోవడం కూడా అక్రమ రవాణాకు కారణమవుతోంది. ఇళ్ల నిర్మాణాలకు ఇసుక సమీప వనరుల నుంచి తీసుకోవచ్చని గవర్నమెంట్‌ చెప్పడం కూడా అక్రమంగా తరలించి.. సొమ్ము చేసుకుంటున్న వారికి కలిసి వస్తోందని చెప్పొచ్చు.

జడవరు విడవరు
మిడ్జిల్‌ మండలంలో దుందుభీ వాగు నుంచి ఇసుకను తవ్వి ట్రాక్టర్లలో నింపుతున్న కూలీలు

కేసులవుతున్నా ఉమ్మడి జిల్లాలో ఆగని ఇసుక అక్రమ రవాణా

మహబూబ్‌నగర్‌ శివారులో యథేచ్ఛగా ఫిల్టర్‌ ఇసుక దందా

ఒక్కో టిప్పర్‌ ధర రూ.25 వేలు

ప్రభుత్వ పనుల్లో ఇదే ఇసుక వాడటంతో నాణ్యత గుల్ల

గతంతో పోల్చితే ఇసుక అక్రమ రవాణా నిలుపుదలపై తగ్గిన శ్రద్ధ

కొన్నిచోట్ల నిద్రావస్థ.. సమాచారమిచ్చినా అధికారుల స్పందన అంతంతే

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా రోజు రోజుకూ మితిమీరిపోతోంది. గతంలో ఉన్న శాండ్‌ ట్యాక్సీ పాలసీలు ఇప్పుడు అమలు కావడం లేదు. అలాగే ప్రభుత్వం ఇసుక రీచ్‌లకు ప్రత్యేకంగా అనుమతులు ఇవ్వకపోవడం కూడా అక్రమ రవాణాకు కారణమవుతోంది. ఇళ్ల నిర్మాణాలకు ఇసుక సమీప వనరుల నుంచి తీసుకోవచ్చని గవర్నమెంట్‌ చెప్పడం కూడా అక్రమంగా తరలించి.. సొమ్ము చేసుకుంటున్న వారికి కలిసి వస్తోందని చెప్పొచ్చు. మరికొన్నిచోట్ల అనుమతులు లేదంటే ప్రభుత్వ పనుల పేరుతో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. పోలీసులు అడపాదడపా తనిఖీలు చేసి.. ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుంటున్నప్పటికీ, గతంకంటే శ్రద్ధ చాలావరకు తగ్గింది. కేసులు నమోదువుతున్నా కూడా కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాలో భవన నిర్మాణ రంగం ఊపు మీద ఉంది. నిర్మాణాలకు ప్రధాన వనరు అయిన ఇసుక కొరత తీవ్రంగా ఉంది. దీంతో అక్రమార్కులు ఎంత రేటు పెట్టిన కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో మాదిరిగా శాండ్‌ ట్యాక్సీ పాలసీలను పకడ్బందీగా అమలు చేయడం లేదనే విమర్శలు వస్తున్నా, అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో ఉన్న పాలసీలతో ప్రభుత్వానికి ఆదాయం రావడంతోపాటు అక్రమ ఇసుక రవాణాను కొంతమేర నియంత్రించారు. ఇప్పుడా పరిస్థితి లేదనే చెప్పొచ్చు.

ఫిల్టర్‌ ఇసుక దందా జోరు..

మొన్నటి వరకు ఎర్రమట్టిని కేవలం రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు చదును చేయడానికి, ఇళ్ల నిర్మాణంలో వాడటానికి మాత్రమే ఉపయోగించేవారు. ఇప్పుడు ఎర్రమట్టిని ఫిల్టర్‌ ఇసుకకు యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. ఈ ఇసుక వాడటం వల్ల నిర్మాణాల్లో నాణ్యత ఉండదు. మర్కెట్‌లో ఇసుక కొరత కారణంగా కొందరు ప్రైవేటుగా ఇంటి నిర్మాణాలు చేసుకుంటున్న వారు కూడా ఈ ఇసుకను వాడుతుండగా, ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు మెజారిటీ ఈ ఫిల్టర్‌ ఇసుకనే వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌ శివారులోని భూత్పూరు మండలం అమిస్తాపూర్‌లో ఏకంగా ఎక్స్‌కవేటర్లతో మట్టి తీసి, దాన్ని అక్కడే ఫిల్టర్‌ చేసి, టిప్పర్లలో తరలిస్తున్నారు. అమిస్తాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ దందాను నడిప్తున్నారు. కేసు నమోదు చేశామని, అడ్డుకున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ దంద యథేచ్ఛగా సాగుతోంది. ఈ ఇసుకను ఇళ్ల నిర్మాణాలకు తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్‌ (సుమారు 6 ట్రాక్టర్లు) ఇసుకకు రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి ఇసుక పాలసీలు సమర్థవంతంగా అమలైనప్పుడు కూడా ఇంత ధర లేదు. కానీ ఇప్పుడు ఫిల్టర్‌ ఇసుకకే ఇంత ధర వెచ్చించాల్సి వస్తోంది. ప్రభుత్వ నిర్మాణాల్లో ఫిల్టర్‌ ఇసుకను వాడటంతో అవి తొందరగా శిథిలావస్థకు చేరే అవకాశం ఉంది.

దుందుభీ నుంచి కొల్లగొడుతున్నారు

తాడూరు మండలం దుందుభీ నది పరివాహక ప్రాంతంలోని గ్రామాల్లో కొంతమంది అక్రమార్కులు ఇసుకను యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్నారు. ప్రజలు అడ్డుకున్న సందర్భాల్లో అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయని చెబుతూ తప్పించుకుంటున్నారు. వారం రోజుల క్రితం రైతులు పోలీసులను పిలిపించి ఓ ట్రాక్టర్‌ను అప్పజెప్పారు. వెల్దండ మండలంలోని వివిధ గ్రామాలకు వంగూరు మండలంలోని చింతపల్లి, చారకొండ మండలంలోని చంద్రాయనపల్లి, గోకారం వాగు నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. కల్వకుర్తి మండలంలోని ఎలికట్ట, మిడ్జిల్‌ మండలంలోని దుందుభి వాగు నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తీసుకెళ్తున్నారు. అప్పుడప్పుడు కేసులు నమోదు చేస్తున్నా పరిస్థితి మారడం లేదు. పెద్దకొత్తపల్లి మండలంలోని మారేడుమాన్‌దిన్నె, కొత్త యాపట్ల, పాత యాపట్ల, వేడుకరావుపల్లి, తిరునాంపల్లి, నారాయణపల్లి గంట్రాపుపల్లిలో ఇసుక డంపులు ఉన్నాయి. అర్ధరాత్రి వేళ ఇసుకను తరలిస్తున్నారు. ఉప్పునుంతల మండలంలోని జప్తిసదగోడు, పెద్దపూర్‌, మొలగర గ్రామాల్లో దుందభీ వాగు నుంచి రాత్రి వేళల్లో ఇసుక స్వాహా చేస్తున్నారు. బిజినేపల్లి మండలం మమ్మాయిపల్లిలో ఫిల్టర్‌ ఇసుక డంపులు చేశారనే ప్రజల ఫిర్యాదుతో డంపులను ఇటీవల సీజ్‌ చేశారు. ఇక్కడి నుంచి భూత్పూరు, జడ్చర్ల, గోపాల్‌పేట, నాగర్‌కర్నూల్‌, తాడూర్‌, తిమ్మాజిపేట మండలాలకు ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. చారకొండ మండలంలో గోకారం, చంద్రయాన్‌పల్లి వాగు నుంచి ఇసుకను అక్రమంగా తీసుకెళ్తున్నారు.

అర్ధరాత్రి వేళ తరలింపు

నవాబ్‌పేట మండలంలోని కారూర్‌, లొకిరేవు, ఇప్పటూరు గ్రామ పరిసరాల వాగుల నుంచి అర్ధరాత్రి వేళ ఇసుకను తరలిస్తున్నారు. రెండు మండలాల సరిహద్దు కావడంతో పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు. కోయిలకొండ మండలంలోని సూరారం, ఆచార్యపూర్‌, మోదీపూర్‌, కోతలాబాద్‌ తదితర గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా, ఫిల్టర్‌ ఇసుక, ఇసుక డంపుల సీజ్‌ పరిపాటిగా మారింది. గండీడ్‌ మండలంలోని రంగారెడ్డిపల్లి, పగిడ్యాల వాగుల నుంచి అర్ధరాత్రి నుంచి ఉదయం 5 గంటల వరకు ఇసుక తరలిస్తున్నారు. ముందుగా ఇళ్ల వద్ద డంపులు చేసుకుని.. రాత్రి వేళల్లో తరలిస్తున్నారు. జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్‌ రిజర్వాయర్‌లో ఫిల్టర్‌ ఇసుక, అల్వాన్‌పల్లి, కుర్వగడ్డపల్లి ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. జడ్చర్లలో భవన నిర్మాణ రంగం ఊపు మీద ఉండటంతో ఆ నిర్మాణాలకు తరలిస్తున్నారు. రాజాపూర్‌ మండలంలోని దుందుభీ నది చివరిలో ఉన్న పలు గ్రామాల్లో ఫిల్టర్‌ ఇసుక తయారు చేసి టిప్పర్ల ద్వారా షాద్‌నగర్‌, జడ్చర్ల, పోలేపల్లి సెజ్‌లకు తరలిస్తున్నారు. అధికారులు ఎన్నిసార్లు దాడులు చేసి, డంపులు సీజ్‌ చేసినా పరిస్థితి మారడం లేదు. మిడ్జిల్‌ మండలంలో దుందుభీ వాగు నుంచి ప్రభుత్వ అనుమతుల పేరుతో ఇసుక తరలింపునకు తహశీల్దార్‌ అనుమతులు ఇచ్చారు. అయితే పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమంగా తరలిస్తున్నారు. రైతులు ఫోన్‌ చేసినా అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

తహసీల్దార్‌ వే బిల్లుల పేరుతో..

ఖిల్లాఘనఫురం మండలంలోని కొత్తపల్లి ఇసుక రీచ్‌కు గత ప్రభుత్వంలో అనుమతులు ఉండేవి. ప్రస్తుతం పరిసర గ్రామాల ట్రాక్టర్‌ యజమానులు అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారు. ఇళ్ల ముందు డంప్‌ చేసుకుని, రాత్రి వేళల్లో టిప్పర్ల ద్వారా బయటకు తరలిస్తున్నారు. తహసీల్దార్‌ వే బిల్లుల పేరుతో కూడా ఈ మండల పరిధిలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. కొన్ని ట్రిప్పులకు అనుమతులు తీసుకుని ఎక్కువ తరలిస్తున్నారు. వనపర్తి మండలం పెద్దగూడెం, కిష్టగిరి, కాశీంనగర్‌, చిట్యాల శివారుల్లో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. చిట్యాల శివారులోని పొలాల్లో అక్కడక్కడ ఇసుక డంపు చేశారు. వీపనగండ్ల మండలం తూంకుట వాగు నుంచి ఇసుక అక్రమ తరలింపు కొనసాగుతోంది. పానగల్‌ మండలంలోని దావాసిపల్లి శివారులో ఫిల్టర్‌ ఇసుక దందా నడుస్తోంది. గోపాల్‌పేట మండలలం చెన్నూరు వాగు నుంచి ఎక్స్‌కవేటర్‌తో ఇసుక డంపు చేసి, రాత్రి వేళల్లో అక్రమంగా తరలిస్తున్నారు.

వాగుల నుంచి అక్రమ రవాణా

గట్టు మండలంలో వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. పోలీసులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఉండవల్లి మండలంలో ఇసుక రీచ్‌లు లేవు. కానీ పుల్లూరు, కలుగొట్ల గ్రామాల వారు ఏపీ శివారులోని పలు గ్రామాల పరిధిలోని తుంగభద్ర నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. పోలీసులు అప్పుడప్పుడు దా డులు చేస్తున్నారు. ఇటీవల అడ్డుకోవడానికి వెళ్లిన పోలీసులను ట్రాక్టర్‌తో ఢీకొట్టే ప్రయత్నం చేసినట్లు సమాచారం. నదిలో ఇసుక కొరత ఉండటంతో ఏపీలోని పంచలింగాల, మునగాలపాడు, నిడ్డూరు, తాండ్రపాడు గ్రామాల నుంచి టిప్పర్ల ద్వారా తెలంగాణలోకి రవాణా చేస్తున్నారు. కేటీదొడ్డి మండలంలోని వాగుల నుంచి ఇసుక తరలిస్తున్నా అడపాదడపా తప్ప, కేసులు నమోదు కావడం లేదు.

Updated Date - Feb 17 , 2025 | 11:35 PM