'విశ్వకర్మ' కరుణించేనా?
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:26 PM
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధానమంత్రి విశ్వ కర్మ యోజన పథకం అమలులో తీవ్ర జాప్యం నెలకొన్నది.

- లబ్ధిదారుల ప్రకటనలో జాప్యం
- వనపర్తి జిల్లాలో 5,273 దరఖాస్తులు
- ఎంపిక చేసి పంపించామంటున్న అధికారులు
వనపర్తి అర్బన్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధానమంత్రి విశ్వ కర్మ యోజన పథకం అమలులో తీవ్ర జాప్యం నెలకొన్నది. దీంతో దరఖాస్తుదారులు 18 నెలలుగా ఎదురుచూస్తున్నారు. కుల, చేతి వృత్తిదారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 2023, సెప్టెం బర్ 17న ప్రారంభించారు. అందుకోసం అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వాటిని పరిశీలించిన అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించారు. కానీ ఇప్పటి వరకు అక్కడి నుంచి ఎలాంటి స్పందనా లేకపోవ డంతో దరఖాస్తుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తు న్నారు. లబ్ధిదారుల ఎంపికకే ఇంత సమయం పడితే, అభ్యర్థులకు శిక్షణ, రుణాల మంజూరుకు ఇంకా ఎంత కాలం పడుతుందని ప్రశ్నిస్తున్నారు.
18 రకాల వ్యాపారులకు రుణాలు
ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా 18 రకాల వ్యాపారులకు రుణ సదుపాయం అందించనున్నారు. ప్రధానంగా స్వర్ణకారులు, వడ్రంగు లు, కమ్మరులు, కుమ్మరులు, రజకులు, దర్జీలు, చెప్పులు కుట్టేవారు, చీపుర్లు, బొమ్మలు, పూలదండలు, పడవలు, చేపలు పట్టే వలలు తయారు చేసేవారు, శిల్పులు, రాళ్లు పగలగొట్టేవారు, చెప్పులు కుట్టేవారు, బట్టలు, చాపలు, చీపుర్లు, బొమ్మలు, పూలదండలు తయారు చేసే వారు తదితర వృత్తిదారులకు ప్రోత్సా హం అందిస్తారు. ఎంపికైన లబ్ధిదారులకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తారు. ఆధునిక పరికరాల కొనుగోలు కోసం రూ.15వేల ఆర్ధిక సహాయంతో పాటు, లక్ష రూపాయల వరకు రుణం మంజూరు చేస్తారు.
వనపర్తి జిల్లాలో 5,273 దరఖాస్తులు
వనపర్తి జిల్లా వ్యాప్తంగా మీ సేవ కేంద్రాలతో పాటు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించారు. ఇప్పటి వరకు 5,273 మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. వీటిని గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో మునిసిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి అర్హులను గుర్తించారు. మొదటి దశలో వచ్చిన 5,273 దరఖాస్తులలో 2,149 మంది లబ్ధిదారులను గుర్తించారు. వారిని ఎంపిక చేసేందుకు జిల్లా ఉన్నతాధికారులకు జాబితాను పంపించారు. కానీ ఇప్పటివరకు లబ్ధిదారులను ప్రకటించలేదు.
సంప్రదాయ వృత్తిదారులు అర్హులు
ఈ పథకానికి స్వయం ఉపాధి ప్రాతిపదికన అసంఘటిత, అనధికారిక రంగం, కుటుంబ ఆధారిత సాంప్రదాయ వృత్తిదారులు, హస్తకళాకారులు అర్హులు. రిజిస్ర్టేషన్ తేదీ నాటికి లబ్ధిదారుడి కనీస వయసు 18 సంవత్సరాలు నిండి, సంబంధిత వృత్తిలో నిమగ్నుడై ఉండాలి. అలాగే గత ఐదు సంవత్సరాలలో స్వయం ఉపాధి, వ్యాపార అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి రుణాలనూ పొంది ఉండకూడదు. అయితే తీసుకున్న రుణాన్ని పూర్తిగా చెల్లించిన వారు, ముద్ర, స్వానిధి లబ్ధిదారులు ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వ ఉద్యోగితో పాటు, వారి కుటుంబసభ్యులు అర్హులు కారు.
త్వరలో మంజూరయ్యే అవకాశం
ప్రధానమంత్రి విశ్వకర్మ పథకానికి సంబంధించిన దరఖాస్తుదారుల్లో లబ్ధిదారులను ఎం పిక చేసి ఉన్నతాధి కారులకు జాబితా పంపించాం. ఎంపిక చేసిన లబ్ధిదారుల లాగిన్ కలెక్టర్ పరిధిలో ఉంటుంది. ఈ పథకం కేంద్రం పరిధిలో ఉంటుంది. కాబట్టి లబ్ధిదారుల ఎంపిక ఆలస్యం అవుతోంది. త్వరలో అర్హులైన ప్రతీ ఒక్కరికి రుణాలు అందుతాయి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
- జ్యోతి, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్