నిఘా నీడలో ఇంటర్ ప్రాక్టికల్స్
ABN , Publish Date - Feb 01 , 2025 | 11:23 PM
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు చెక్ పెట్టేందుకు విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది.
- మాస్ కాపీయింగ్‌కు చెక్
- రేపటి నుంచి 22 వరకు పరీక్షలు
వనపర్తిరూరల్/నాగర్‌కర్నూల్ టౌన్/మహబూబ్‌నగర్ విద్యావిభాగం/గద్వాల, ఫిబ్రవరి1 (ఆంధ్రజ్యోతి) : ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు చెక్ పెట్టేందుకు విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిఘా నీడలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రైవేటు కళాశాలల విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షల్లో మార్కులు అధికంగా వస్తున్నాయనే ఆరోపణలకు చెక్ పెట్టేందుకు పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. వీటిని ఇంటర్ ఎగ్జామ్ బోర్డు హైదరాబాద్‌కు అనుసంధానం చేస్తారని అధికారుల ద్వారా తెలిసింది. పరీక్షలు నిర్వహించే తీరును అక్కడి నుంచి పర్యవేక్షించ నున్నారు. ఏవైనా అక్రమాలు జరిగినట్లు వారి దృష్టిలో సంబంధిత కళాశాల యజమానులపై చర్యలు తీసుకో నున్నారు. సోమవారం నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి 22 వరకు ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో నాలుగు విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తారు. మొదటి విడత 3వ తేదీ నుంచి ఏడో తేదీ వరకు, రెండో విడత 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు, మూడో విడత 13 నుంచి 17 వరకు, నాలుగో విడత 18 నుంచి 22 వరకు నిర్వహించనున్నారు.
వనపర్తి జిల్లావ్యాప్తంగా 41 పరీక్షా కేంద్రాలను ఏర్పా టు చేశారు. మొత్తం జనరల్ 4,104 (ద్వితీయ సంవ త్సరం) మంది, ఒకేషనల్ 2,487 (ప్రథమ, ద్వితీయ సంవ త్సరం) మంది విద్యార్థులు పరీక్షలకు (7వ పేజీ తరువాయి..)
హాజరు కానున్నారు. జనరల్ విభాగంలో ఎంపీసీ విద్యార్థులు 2,234 మంది, బైపీసీ విద్యార్థులు 1,870 మంది ఉన్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా 43 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జనరల్ 38, ఒకేషనల్ 5 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జనరల్ విద్యార్థులు 2,882 మంది(ద్వితీయ సంవత్సరం), ఒకేషనల్ విద్యార్థులు - 1,412 మంది (ప్రథమ మరియు ద్వితీయ సంత్సరం) హాజరు కానున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో జనరల్ 36, ఒకేషనల్ 13 కేంద్రాలు ఉన్నా యి. మొత్తం 12,109 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. జనరల్ 8,392 మంది (ద్వితీయ సంవత్సరం), ఒకేషనల్ 3,717 మంది (ప్రథమ, ద్వితీయ) విద్యార్థులు హాజరుకానున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో 15 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 8,643 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.
ఆన్‌లైన్‌లో ప్రశ్న పత్రాలు
ప్రాక్టికల్స్‌కు సంబంధించిన ప్రశ్న పత్రా లు ఇంటర్ బోర్డు ఆన్‌లైన్‌లో పొందుపర చనున్నది. అరగంట ముందుగా సంబంధిత శాఖలకు ఓటీపీ వస్తుంది. ఆ ప్రకారం ప్రశ్న పత్రాన్ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష నిర్వహణ కోసం డీఈసీని ఏర్పాటు చేశారు. కన్వినర్‌గా డీఐవో అంజయ్య, సభ్యులుగా ఇద్దరు ప్రిన్సిపాళ్లు, ఒక అధ్యాపకుడిని నియమించారు.
విద్యార్థులు ఒత్తిడికి గురి కావొద్దు
విద్యార్థులు ప్రశాంత వాతావర ణంలో ప్రాక్టికల్స్ చేయాలి. ఒత్తిడికి గురి కావొద్దు. ప్రైవేటు కళాశాలల యజమాన్యాలు కళాశాల ఫీజు చెల్లించలేదని విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయొద్దు. ప్రతీ విద్యార్థి ప్రాక్టికల్స్‌కు హాజరయ్యే విధంగా చూడాలి. ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవు. ప్రతీ ప్రభుత్వ కళాశాలకు సీసీ కెమెరాల సామాగ్రి పంపిణీ చేశాం.
- డీఐఈవో ఎర్రం అంజయ్య