Share News

షేర్‌ మార్కెట్లో రూ.2 కోట్ల పెట్టుబడులు

ABN , Publish Date - Jan 02 , 2025 | 11:25 PM

షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన ఏజెంట్‌ మృతి చెందడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

షేర్‌ మార్కెట్లో   రూ.2 కోట్ల పెట్టుబడులు
గద్వాల పట్టణంలోని సుంకులమ్మ మెట్టువద్ద ఏర్పాటు చేసిన ఏంజిల్‌వన్‌ సర్వీస్‌ కార్యాలయం

- అధిక వడ్డీ ఆశతో అప్పులిచ్చిన మరికొందరు

- ఏజెంట్‌ మృతితో చేతులెత్తేసిన బంధువులు

- న్యాయం కోసం స్టేషన్‌ మెట్లెక్కిన బాధితులు

- పట్టించుకోకపోవడంతో ఎస్పీ ఫిర్యాదు

గద్వాల, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన ఏజెంట్‌ మృతి చెందడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కొందరు లాభాల కోసం, మరికొందరు అధిక వడ్డీకి ఆశపడి పెట్టుబడులు పెట్టారు. ఐదు నెలల క్రితం ఏజెంట్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో షేర్‌ మార్కెట్‌ గురించి తెలియని మృతుడి బంధువులు చేతులెత్తేశారు. దీంతో బాధితులు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడ న్యాయం జరగకపోవడంతో గురువారం ఎస్పీ శ్రీనివాస్‌రావుకి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గద్వాల మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన కుర్వ వెంకటేష్‌ ఆయన భార్య సుమిత్రలు కలిసి ఏంజిల్‌వన్‌ పేరుతో గద్వాల పట్టణంలోని సుంకులమ్మ మెట్టువద్ద సర్వీస్‌ ఆఫీసును ఓపెన్‌ చేశారు. ఇందులో ఈక్విటీ, డీమ్యాట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ క్రయవిక్రయాలు చేసేవారు. ఆయనతో పాటు బంధువులు, స్నేహితులు, మరికొందరితో షేర్‌ మార్కెట్‌లో దాదాపు రూ.2కోట్ల వరకు పెట్టుబడులు పెట్టించారు. గత ఆగస్టు వరకు ఎవరికి ఇబ్బందులు రాకుండా వెంకటేష్‌ చూసుకున్నాడు. ఆగస్టు నెలలో ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. షేర్‌ మార్కెట్‌ లావాదేవీలు చూసే వ్యక్తి మృతి చెందడం, భార్య సుమిత్రకు షేర్‌ మార్కెట్‌ గురించి తెలియకపోవడంతో అప్పటి నుంచి ఆఫీసు మూతపడింది. దీంతో ఇందులో పెట్టుబడులు పెట్టిన వ్యక్తులు, ఆప్పులు ఇచ్చిన వ్యక్తులు కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చారు. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులపై వారు చేతులెత్తేశారు. దీంతో బాధితులు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రతినిధులను కలిసి మొరపెట్టుకున్నారు. మొదట న్యాయం చేస్తామని చెప్పి పోలీసులు తర్యాత నిస్సహాయత వ్యక్తం చేయడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. విచారణ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు.

ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవమే..

బాధితులు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే.. షేర్‌ మార్కెట్‌ లీగల్‌ కావడం, అందులో పెట్టుబడిదారుల పేరుపై పెట్టారు. కొందరు అధిక వడ్డీకి అప్పులు ఇచ్చారు. ఇవన్నీ సివిల్‌ మ్యాటర్‌ కావడంతో న్యాయస్థానానికి వెళ్లమని చెప్పాను. బాధితులు న్యాయం చేయడం లేదనేది అవాస్తవం. లీగల్‌గా డబ్బులు రాబట్టుకోవాలని సూచించాను.

- శ్రీకాంత్‌, రూరల్‌ ఎస్సై, గద్వాల

Updated Date - Jan 02 , 2025 | 11:25 PM