పండుగ వాతావరణంలో పథకాల అమలు
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:20 PM
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఆదివారం నుంచి ప్రాంభించనున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు.

- ప్రతీ మండలంలో ఒక్క గ్రామాన్ని ఎంపిక చేయాలి
- కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఆదివారం నుంచి ప్రాంభించనున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. ప్రతీ మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి సంక్షేమ పథకాల అమలు కార్యక్రమాన్ని అట్టహాసంగా పండుగ వాతావరణంలో ప్రాంభించాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం కలెక్టర్ నుంచి నియోజకవర్గ, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవోలు, వ్యవసాయాధికారులు, ఏపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నేడు ప్రాంభించనున్న నాలుగు పథకాల ప్రాంభంపై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ప్రతీ మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి సంక్షేమ పథకాల అమలు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో ప్రారంభించాలని సూచించారు. ప్రజా ప్రతినిధులను సంప్రదించి వారి సూచన మేరకు ఒక గ్రామం చొప్పున ఎంపిక, పథకాల ప్రాంభోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజాప్రతినిధులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని మధ్యాహ్నం ఒంటి గంటకు సంక్షేమ పథకాల అమలును ప్రాంభించేందుకు శ్రీకారం చుట్టాలన్నారు. ముందుగా ముఖ్యమంత్రి సందేశంతో కూడిన వీడియోను స్ర్కీన్ ద్వారా ప్రదర్శించాలన్నారు. ఆహార భద్రతా కార్డులకు తహసీల్దార్, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపీడీవో, రైతు భరోసాకు ఏవోను, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఏపీవోఅ ఆధ్వర్యంలో పథకాల ప్రాంభోత్సవం జరగాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్‌రావు పాల్గొన్నారు.