Share News

మునిసిపాలిటీల్లో ముమ్మరంగా ఆస్తిపన్ను వసూలు

ABN , Publish Date - Feb 24 , 2025 | 11:33 PM

మునిసిపాలిటీలకు స్థానికంగా లభించే ప్రధాన ఆదాయాల్లో ఒకటైన ఆస్తి పన్ను.. ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో ఆస్తి పన్ను వసూళ్లను అధికారులు ముమ్మరం చేశారు.

మునిసిపాలిటీల్లో ముమ్మరంగా ఆస్తిపన్ను వసూలు
గద్వాల పట్టణ మునిసిపల్‌ కార్యాలయం

- వందశాతం లక్ష్యంగా కసరత్తు చేస్తున్న అధికారులు

- 40 శాతం కూడా దాటని గద్వాల మునిసిపాలిటీ

- వడ్డేపల్లిలో 75శాతం వసూలు

గద్వాల టౌన్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : మునిసిపాలిటీలకు స్థానికంగా లభించే ప్రధాన ఆదాయాల్లో ఒకటైన ఆస్తి పన్ను.. ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో ఆస్తి పన్ను వసూళ్లను అధికారులు ముమ్మరం చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో గద్వాల, అలంపూర్‌, అయిజ, వడ్డేపల్లి నాలుగు మునిసిపాలిటీలు ఉన్నాయి. వీటిద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏరియర్స్‌, జరిమానాలతో కలిసి మొత్తం రూ.12.09 కోట్ల మేర పన్ను రూపంలో వసూలు కావాల్సి ఉంది. ఒక్క వడ్డేపల్లి మునిసిపాలిటీలో మాత్రమే 75శాతం వసూలు చేశారు. అయిజలో 40శాతం, అలంపూర్‌లో 54శాతం వసూలు కాగా, గద్వాల పట్టణంలో 40 శాతం కూడా దాటక పోవడం గమనార్హం.

ఫ గద్వాల : గద్వాల పట్టణంలో నివాస గృహాలు, రెసిడెన్షియల్‌, నాన్‌రెసిడెన్షియల్‌, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆస్తులు కలిపి మొత్తం పన్ను వసూలు చేయాల్సిన ఆస్తుల సంఖ్య 16,036గా ఉంది. వీటి ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.4 కోట్ల 44లక్షల13 వేలు వసూలు చేయాల్సి ఉంది. జరిమానా రూపంలో రూ.17.56 లక్షలు, ఏరియర్స్‌ రూపంలో రూ.2 కోట్ల 15లక్షల 55వేలు రావాల్సి ఉంది. నిబంధనల మేరకు విధించిన జరిమానా రూ.2 కోట్ల 8 లక్షల 56వేలుగా అధికారులు నిర్ధారించారు. దీంతో ఈ ఏడాది వసూలు చేయాల్సిన మొత్తం ఆస్తి పన్ను విలువ రూ.8 కోట్ల 94లక్షల 46వేలు. ఇందులో ఇప్పటివరకు రూ.2కోట్ల 77లక్షల 69వేలు మాత్రమే వసూలు చేశారు.

అలంపూర్‌ పట్టణంలో నివాస గృహాలు, రెసిడెన్షియల్‌, నాన్‌రెసిడెన్షియల్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆస్తులు మొత్తం 3,543లుగా ఉన్నాయి. వివిధ రూపాల్లో వసూలు చేయాల్సిన ఆస్తి పన్ను రూ.48.51లక్షలు కాగా ఇప్పటి వరకు మొత్తం రూ.28.06 లక్షలు వసూలు చేశారు. అయిజ పట్టణంలో నివాస గృహాలు, రెసిడెన్షియల్‌, నాన్‌రెసిడెన్షియల్‌ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వానికి చెందిన మొత్తం ఆస్తుల సంఖ్య 8,074 ఉండగా వివిధ రూపాల్లో రావాల్సిన ఆస్తి పన్ను రూ.1 కోటి 74 లక్షల 90వేలకు చేరింది. ఇప్పటి వరకు మొత్తం రూ.87.14 లక్షలు వసూలు చేశారు. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.87.76లక్షలు వసూలు చేయాల్సి ఉంది. వడ్డేపల్లి పట్టణంలో నివాస గృహాలు, రెసిడెన్షియల్‌, నాన్‌రెసిడెన్షియల్‌ కలిసి మొత్తం 3,981 ఆస్తుల ద్వారా వివిధ రూపాల్లో వసూలు చేయాల్సిన ఆస్తి పన్ను రూ.96.85లక్షలు కాగా, ఇప్పటి వరకు మొత్తం రూ.73.45 లక్షలు వసూలైంది.

వందశాతం వసూలుకు చర్యలు

గద్వాల మునిసిపాలిటీలో వందశాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. వివిధ కారణాలతో ఏళ్ల తరబడి ఆస్తిపన్ను చెల్లించని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. కలెక్టర్‌ ఆదేశాల మేరకు మార్చి 1వ తేదీ నుంచి ఆర్థిక సంవత్సరం చివరి వరకు స్పెష ల్‌ డ్రైవ్‌ ద్వారా వసూళ్లకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.

- దశరథ్‌, గద్వాల మునిసిపల్‌ కమిషనర్‌

Updated Date - Feb 24 , 2025 | 11:33 PM