చల్లంగా చూడమ్మా.. జములమ్మ
ABN , Publish Date - Feb 12 , 2025 | 11:17 PM
నిండు పౌర్ణమి నాడు జములమ్మ దేవత ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

- భక్తి శ్రద్ధలతో పౌర్ణమి వేడుకలు
- పట్టు వస్ర్తాలు సమర్పించిన ఎమ్మెల్యే దంపతులు
- అమ్మవారిని దర్శించుకున్న 50 వేల మంది భక్తులు
గద్వాల ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : నిండు పౌర్ణమి నాడు జములమ్మ దేవత ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని జమ్మిచేడు జములమ్మ ఆలయంలో బుధవారం పౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామున మూడు గంటలకు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు కృష్ణానదికి వెళ్లారు. 108 కలశాలతో నదీ జలాన్ని ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేశారు. నాలుగు గంటల సమయంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, బండ్ల జ్యోతి దంపతులు అమ్మవారికి పట్టువస్ర్తాలను తీసుకురాగా, వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆ వస్ర్తాలతో అర్చకులు అమ్మవారిని అలంకరించగా, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ వెంకట్రాములు, ఈవో పురేందర్‌కుమార్‌లు వారిని సత్కరించి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం భక్తుల దర్శ నానికి అవకాశం కల్పించారు. జములమ్మ తల్లీ కరు ణించవమ్మా అంటూ భక్తులు అమ్మవారికి పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. బైనోళ్ల సవ్వడి, డప్పు వాయిద్యాలు, మహిళల పూనకాలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. మన రాష్ట్రంతో పాటు ఏపీ, కర్ణాటక ప్రాంతాల నుంచి తరలివచ్చిన 50 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శిం చుకున్నట్లు ఆలయ చైర్మన్, ఈవోలు తెలిపారు.
వైభవంగా పల్లకీ సేవ
పౌర్ణమి వేడుకల్లో భాగంగా సాయంత్రం అమ్మవారికి పల్లకీసేవ నిర్వహించారు. భక్త జన సందోహం మధ్య ఉత్సవమూర్తులను పల్లకిలో ఉంచి, ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేయంచారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరెక్టర్లు మధుమతి, రాధారెడ్డి, మంగలి వీరేశ్, వెంకటేశ్, బాబు, కురువ ముసిలన్న, అక్కల శ్రీనివాసులు, రాజు, బైని నాగరాజు, తూము కృష్ణ, మల్లేశ్, చంద్రశేఖర్, ఉద్యోగులు మురళీధర్‌రెడ్డి, రవిప్రకాష్, రాజలింగం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.