Share News

ఘనంగా మహాశివరాత్రి

ABN , Publish Date - Feb 26 , 2025 | 11:17 PM

జిల్లా వ్యాప్తంగా బుధవారం శివరాత్రి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

ఘనంగా మహాశివరాత్రి
పేటలో నిర్వహించిన శివపార్వతుల కల్యాణంలో దీక్షిత్‌ కుటుంబీకులు

- శివనామస్మరణలతో మారుమోగిన శివాలయాలు

- శివలింగాలకు అభిషేకాలు

- ఉపవాస దీక్షలో భక్తులు

నారాయణపేట/దామరగిద్ద/కోస్గి/మక్తల్‌/ ధన్వాడ/మరికల్‌/నర్వ/మాగనూరు/కృష్ణ, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా బుధవారం శివరాత్రి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉపవాస దీక్షలు చేపట్టి దగ్గర్లోని శివాలయాలకు వెళ్లి శివారాధన చేశారు. శివలింగాలకు రుద్రాభిషేకం, బిల్వార్చన పూజలు నిర్వహించారు. భక్తుల శివనామస్మరణలతో ఆలయాలు కిటకిటలాడాయి. నారాయణపేట మండలం సింగారం గ్రామంలోని ఈశ్వర్‌మంది ర్‌, రామలింగేశ్వర ఆలయం, మల్లికార్జున ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. గురునాథ్‌స్వామి నివాసం నుంచి శివపార్వతుల పల్లకీసేవ ఊరేగింపు పురవీధుల గుండా జరిగింది. మహిళలు హారతులు చేపట్టి దారి పొడవునా నీరు పోస్తు స్వాగతం పలికారు. శివస్వాములు ఖడ్గ విన్యాసాలు చేశారు. కార్యక్రమంలో గురు స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మహా గణపతి ఫౌండేషన్‌ దీక్షిత్‌ కుటుంబీకుల ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పళ్ల బురుజు లక్ష్మీ గణపతి ఉమామహేశ్వర దేవాలయం ఆవరణలో ఉమామహేశ్వర కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. గురువారం ఉదయం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కోటకొండలో కాకతీయుల కాలం నాటి భారీ శివలింగానికి ప్రముఖ న్యాయవాది సీతా రామారావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రుద్రహోమంతో పాటు విశేష అభిషేకాలు కొన సాగాయి. కార్యక్రమంలో ప్రభంజన్‌రావు, శ్రీనివాస్‌, భీంసేన్‌, పద్మనాభరావు, విద్వాన్‌ జయ తీర్థ, శ్రీపాద్‌, భరత్‌, శ్రీను తదితరులు పాల్గొన్నారు. పేట బదిగప్పమఠం శివలింగేశ్వర దేవా లయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారు జామునే భక్తులు శివాలయానికి వెళ్లి అభిషేకాలు చేశారు. కార్యక్రమంలో గందె రవికాంత్‌, లిఖీ రఘు, హరకంచి రవి, అఖిలభారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి జిల్లా కన్వీనర్‌ కాకర్ల భీమయ్య తదితరులున్నారు. నారాయణపేటలో బారంబావి శివాలయం, లింగయ్యగుడి, శ్రీతీర్థం, మహంకాళీ రోడ్‌ శివాలయం తదితర దేవాల యాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.

అలాగే, దామరగిద్ద మండలం మద్దెల్‌బీడ్‌ గ్రామంలోని శివాలయం వద్ద శివస్వాముల ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆశన్‌పల్లి గ్రామంలో శివనామ స్మరణతో శివపార్వతుల పల్లకీ సేవ ఊరేగింపు నిర్వహించారు.

అదేవిధంగా, కోస్గి పట్టణంలోని తిమ్మన్నబావి శివాంజనేయస్వామి ఆలయం, నీలకంఠస్వామి ఆలయం, ఇంద్రనీల లింగ శివాలయానికి భక్తులు పోటెత్తారు.

మక్తల్‌ పట్టణంలోని శివాజీనగర్‌లో వెలసిన కుంభేశ్వరాలయంలో శివపార్వతుల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే స్థానిక మల్లికార్జునస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరగడంతో ఆలయం నుంచి రోడ్డు వరకు భక్తులు క్యూ లైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. ఎస్సై భాగ్యలక్ష్మీరెడ్డి పోలీస్‌ సిబ్బందితో ఆయా ఆలయాల వద్ద బందోబస్తు నిర్వహించారు.

ధన్వాడలోని సురాన్‌పల్లి ఆలయంలో హిందువాహిని యువకులు ఉపవాస దీక్షలు ఉన్న భక్తులకు పాలు, పండ్లు అందించారు. ఆలయ పూజారి వల్కే ఆనంద్‌ భక్తులకు తీర్థర పసాదాలు అందించారు. వృద్ధామల్లికార్జున ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామంలో కలశం ఊరేగించారు. భజనలు, సంకీర్తలతో స్వామివారికి పల్లకీసేవ నిర్వహించారు.

మరికల్‌లోని భ్రమరాంభ సమేత మల్లికార్జునస్వామి ఆలయంలో రాత్రి జాగరణ సందర్భంగా విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు, రాఘవేంద్రచార్యచే ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వ హించనున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

నర్వ, మాగనూరు, కృష్ణ మండల కేంద్రాలతో పాటు, పలు గ్రామాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కొందరు ఉపవాసాలు ఉండి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - Feb 26 , 2025 | 11:17 PM