నాలుగు యుగాలు.. నాలుగు పేర్లు
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:52 PM
నాలుగు యుగాల్లో నాలుగు పేర్లతో విరాజిల్లిన ప్రముఖ పుణ్య క్షేత్రం గంగాపురం.

- విశిష్ట, ప్రాచీన పుణ్య క్షేత్రం గంగాపురం
- ఆలయంలో కొలువుదీరిన చెన్నకేశవ స్వామి
- మాఘ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు బ్రహ్మోత్సవాలు
జడ్చర్ల, జనవరి 30 (ఆంధ్రజ్యోతి) : నాలుగు యుగాల్లో నాలుగు పేర్లతో విరాజిల్లిన ప్రముఖ పుణ్య క్షేత్రం గంగాపురం. మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల మండలంలో చెన్నకేశవ స్వామి కొలువుదీరిన ఈ క్షేత్రం కృతయుగంలో మత్స్యపురిగా, త్రేతాయుగంలో దురితకోలాహలంగా, ద్వాపరయుగంలో మాయాపురంగా, కలియుగంలో గంగాపురంగా పేరు గాంచినట్లు స్కంద పురాణ కథనం. ఇక్కడ ప్రతీ సంవత్సరం మాఘమాస పాడ్యమి నుంచి నవమి వరకు అంగ రంగ వైభవంగా నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభం అయ్యాయి.
గంగాపురం నుంచి గండకాద్రికి స్వామి
ఈ క్షేత్రంపై ఆసక్తికర కథనం ప్రచారంలో ఉంది. ద్వాపరయుగంలో మయుడి కుమారుడైన దుర్జయుడు గండకాద్రి అనే పట్టణాన్ని ధ్వంసం చేశాడు. అక్కడి మునులు గంగాపురం క్షేత్రానికి వచ్చి, వీరనారాయణ స్వామిని వేడుకున్నారు. దీంతో స్వామి గండకాద్రికి వెళ్లి దుర్జయుడిని వధించి పట్టణాన్ని పునరుద్ధరించి అక్కడే నిలిచిపోయాడు. కలియుగ ఆరంభంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించే పుణ్యశీల మహరాజుకు స్వామి కలలో కనిపించాడు. మునుల కోరిక మేరకు గండకాద్రిలో కొలువై ఉన్నానని, మళ్లీ గంగాపురం గ్రామానికి రానున్నట్లు వెల్లడించారు. అక్కడి నుంచి స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి, గంగాపురంలో ప్రతిష్ఠించాలని, చెన్నకేశవస్వామిగా భక్తుల పూజలందుకుం టానని తెలిపారు. దీంతో పుణ్యశీల మహారాజు స్వామి విగ్రహాన్ని అక్కడి నుంచి గంగాపురం క్షేత్రానికి తీసు కొచ్చి ప్రతిష్ఠించి, ఆలయం నిర్మించారు.
పునర్నిర్మించిన త్రైలోక్యమల్ల సోమేశ్వరుడు
కాలక్రమంలో శిథిలమైన గంగాపురం దేవాలయా న్ని 1042 నుంచి 1062 సంవత్సరాల మధ్య త్రైలోక్య మల్ల సోమేశ్వరుడు అనే చాళక్యరాజు సుందర శిల్పా లతో పునర్నిర్మించారు. గ్రామానికి నైరుతి దిశలో రెండు ప్రాకారాలతో, ఎత్తయిన వేదికపై తూర్పు ము ఖంగా ఏక కూటాలయ వాస్తురీతిలో ఆలయాన్ని నిర్మించారు. మొదటి ప్రాకారంపై శిల్పాలు, ప్రవేశ ద్వారానికి నగిశీలతో శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. నాలుగు స్తంభాలతో కృష్ణ మండపం, అంజలి ఘటిస్తున్న ఆంజనేయస్వామి విగ్రహంతో దేవాలయం, రాతిమెట్లతో పుష్కరణిని నిర్మించారు. అప్పటి నుంచి 15వ శతాబ్దం వరకు స్మార్థాగమ విష్ణు పంచాయతన సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీవైష్ణవ పంచరాత్రాగమ విధానంలో నిత్య పూజలు, బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.
ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
గంగాపురం లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు అభిషేకం నిర్వ హించే 108 కలశాలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారికి పుణ్యాహవాచ నము, అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండున తిరుకల్యాణం, మూడున పుష్పరథం (చిన్నతేరు), నాలుగున రథ సప్తమిని పురస్కరించుకొని రథోత్సవం (పెద్దతేరు) నిర్వహించనున్నారు. ఐదున శకటోత్సవం, ఆరున చక్ర తీర్థం కార్యక్రమాలను ఉంటాయని ఈవో దీప్తిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అర్చకుడు కేశవాచారి, ట్రస్టు సభ్యులు జనార్దన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శేఖర్, మల్లి కార్జున్, బ్రహ్మలింగం, గోపాల్‌యాదవ్, జంగయ్య, విశ్వంగుప్త, భీమస్వామి, నారాయణరెడ్డి పాల్గొన్నారు.