Share News

కార్పొరేట్‌కు దీటుగా.. ‘ఆదర్శ’ బోధన

ABN , Publish Date - Jan 31 , 2025 | 11:43 PM

ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలు కార్పొరేట్‌, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు దీటుగా ఆంగ్ల మాధ్యమంలో మెరు గైన విద్యను అందిస్తున్నాయి.

కార్పొరేట్‌కు దీటుగా.. ‘ఆదర్శ’ బోధన
ఖిల్లాఘణపురంలోని ఆదర్శ పాఠశాల భవనం

- ఆంగ్ల మాధ్యమంలో మెరుగైన విద్యనందిస్తున్న తెలంగాణ ఆదర్శ పాఠశాలలు

- ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న గ్రామీణ విద్యార్థులు

- ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ

- ఈ నెల 28 వరకు దరఖాస్తుల స్వీకరణ

- ఏప్రిల్‌ 13న ప్రవేశ పరీక్ష

ఖిల్లాఘణపురం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలు కార్పొరేట్‌, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు దీటుగా ఆంగ్ల మాధ్యమంలో మెరు గైన విద్యను అందిస్తున్నాయి. ఇక్కడ చదువుకుంటు న్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ప్రశం సలు అందుకుంటున్నారు. ఆరవ తరగతి నుంచి 10వ తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో విద్యాబోధన కొనసాగుతోంది. 10వ తరగతి తర్వాత మెరిట్‌ ప్రకా రం ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి అవకాశం ఉంటుం ది. వనపర్తి జిల్లాలోని ఖిల్లాఘణపురం, కొత్తకోట, పెబ్బేరు మాండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశా లకు ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, మెరిట్‌ ప్రకారం, రిజర్వేషన్‌ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రతీ సంవత్సరం ఆరవ తరగతిలో వంద మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. మొత్తంగా 10వ తరగతి వరకు 500 మంది విద్యార్థులు ఉంటా రు. 2025 - 26 విద్యాసంవత్సరంలో ప్రవేశానికి జనవరి ఆరున దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయ్యింది. ఈ నెల 28 వరకు అవకాశం ఉంటుంది.

ఆధునాతన వసతులు

ఆదర్శ పాఠశాలల్లో పక్కా భవనాలతో పాటు విశాలమైన తరగతి గదులు ఉన్నాయి. ప్రయోగ శాలలు, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, వృత్తి విద్యకు సంబం ధించిన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. విద్యా ర్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, యూని ఫాంలను ఉచితంగా అందిస్తున్నారు. ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేస్తూ, విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందిస్తూ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులకు అకాడమిక్‌ విద్యతో పాటు ఎంసెట్‌, నీట్‌కు సంబంధించిన శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇంటర్మీడియట్‌ చదువుతున్న 100 బాలికలకు హాస్టల్‌ వసతి కూడా ఉంటుంది.

స్థానిక విద్యార్థులకు ప్రాధాన్యం

ప్రవేశాలలో స్థానిక విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ఆ తరువాత ఇతర మండలాల విద్యార్థు లకు అవకాశం కల్పిస్తారు. ప్రవేశ పరీక్షలో తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం, ఆంగ్ల పాఠ్యాంశాలపై 25 మార్కుల చొప్పున ఐచ్చిక తరహాలో ప్రశ్నలు ఉంటాయి. సమాధానాలను ఓఎంఆర్‌ షీట్లల్లో గుర్తించాల్సి ఉంటుంది. విద్యార్థులు సాధించిన మార్కుల మెరిట్‌ ఆధారంగా, రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయిస్తారు.

ప్రతిభ చాటుతున్న విద్యార్థులు

ఆదర్శ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ప్రతిభ చాటుతున్నారు. పదవ తరగతి పరీక్షల్లో ఎక్కువ మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. పోటీ పరీక్షల్లోనూ రాణిస్తున్నారు. ఇంటర్మీడియట్‌ విద్యా ర్థులు నీట్‌, ఎంసెట్‌, జేఈఈ మెయిన్స్‌ తదితర పరీ క్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ, ప్రముఖ విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందుతున్నారు. చదువుతో పాటు జాతీయ స్థాయి క్రీడల్లో సైతం ప్రతిభ కనబరుస్తున్నారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి విద్యార్థులు ఈ నెల 28 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బోనఫైడ్‌, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పాస్‌పోర్ట్‌ సైజ్‌ పొటోలతో మీ సేవ కేంద్రాలు, ఇంటర్నెట్‌ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు రూ.125, జనరల్‌ విద్యార్థులకు రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు సంబంధించిన హార్డ్‌ కాపీని సంబంధిత ఆదర్శ పాఠశాలల్లో సమర్పించాలి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్‌ 13న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఆరవ తరగతిలో ప్రవేశానికి ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఏడు నుంచి 10వ తరగతి వరకు మధ్యాహ్నం రెండు నుంచి, నాలుగు గంటల వరకు ఆయా పాఠశాలల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఆరవ తరగతిలో వంద సీట్లు, ఏడు నుంచి 10వ తరగతి వర కు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేస్తారు.

Updated Date - Jan 31 , 2025 | 11:43 PM