ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
ABN , Publish Date - Feb 11 , 2025 | 11:21 PM
పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు
- కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో హన్వాడ, గండీడ్, సీసీకుంట, మూసాపేట, కోయిల్‌కొండ, నవాబ్‌పేట, కౌకుంట్ల, మహ్మదాబాద్ మండలాలకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికలకు నియమించిన స్టేజ్-1 ఆర్‌వో, ఏఆర్‌వో, స్టేజ్-2 ఆర్‌వోలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ముందుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. నియమ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు క్రియాశీలక పాత్ర పోిషించాల్సి ఉంటుందని, ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనలు, హ్యాండ్ బుక్కులను అనుసరించి ఎన్నికలు నిర్వహణ చేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్ ప్రకటన అనుసరిస్తూ నోటిఫికేషన్ జారీ, నామినేషన్ ప్రక్రియ నిర్వహించాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీపీవో పార్థసారథి, సీఎంవో బాలు యాదవ్ పాల్గొన్నారు.
సంగీత నృత్య కళలో రాణించేలా శిక్షణ ఇవ్వాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : బాల కేంద్రంలో శిక్షణ పొందుతున్న చిన్నారులు సంగీత, నృత్య కళల్లో రాణించే విధంగా శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ విజయేందిర బోయి శిక్షకులకు ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బాలకేంద్రాన్ని, ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, కోర్స్‌ల శిక్షణల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు పక్కనే ఉన్న సంగీత నృత్య కళాశాలను సందర్శించారు. ఔట్ సోర్సింగ్‌లో పని చేస్తున్న అధ్యాపకులకు రెండేళ్లుగా వేతనాలు రావడం లేదని కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. డీఈవో ప్రవీణ్‌కుమార్, కేజీబీవీ ఏఎంవో దుంకుడు శ్రీనివాస్, బాల కేంద్రం డ్రాయింగ్ అధ్యాపకులు పాల్గొన్నారు.