గ్రామాల్లో తాగునీటి సమస్య ఉండకూడదు
ABN , Publish Date - Mar 05 , 2025 | 11:08 PM
గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చూసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ అన్నారు.

- డీపీవో కృష్ణ
- నర్వ పరిషత్‌లో పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష
నర్వ, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చూసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ అన్నారు. బుధవారం నర్వ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండలాల పంచాయతీ కార్యదర్శులు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి డీపీవో కృష్ణ, జడ్పీ సీఈవో భాగ్యలక్ష్మి హాజరై, మాట్లాడారు. పల్లెప్రకృతి, మొక్కల సంరక్షణ, వైకుంఠ ధామాలు, హరితహారం, నర్సరీలు ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఇందిరమ్మ ఇళ్లు, వేసవి దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి సమస్య తదితర అంశాలపై వారు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ప్రజలతో మమేకమై ప్రతీ సమస్యను తెలుసుకొని పరిష్కరించాలని సూచించారు. ప్రస్తుతం గ్రామాల్లోని తాగునీటి బోర్లను పరిశీలించాలన్నారు. నల్లాల నుంచి నీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని, రోడ్ల వెంట ఉన్న మొక్కలు ఎండిపోకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని అందించి సంరక్షించుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అర్హులను గుర్తించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పనులను వేగవంతం చేసి పనుల వద్ద కూలీలకు మౌలిక వసతులను కల్పించాలన్నారు. తడి, పొడి చెత్తలతో వర్మి కంపోస్టు ఎరువులు తయారు చేయాలన్నారు. గ్రామాల్లో మహిళా సంఘాలతో సమావేశాలు నిర్వహించాలన్నారు. కార్యదర్శులు ఉదయం తొమ్మిది గంటలకు గ్రా మాల్లో ఉండాలన్నారు. అభివృద్ధి పనులను పెండింగ్‌లో పెట్టకుండా త్వరగా చేపట్టాలన్నారు. గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టే విధంగా యువతను ప్రోత్సహించాలని తెలిపారు. సమావేశంలో ఏపీవో రాఘవేందర్ తదితరులున్నారు.