Share News

సింథటిక్‌ కెమికల్‌కు అనుమతులు ఇవ్వొద్దు

ABN , Publish Date - Feb 23 , 2025 | 11:32 PM

చిత్తనూరు ఇథనాల్‌ కంపెనీలో అమోనియం లాంటి తొమ్మిది రకాల సింథటిక్‌ కెమికల్స్‌కు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వొద్దని కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి జిల్లా కన్వీనర్‌ ఎస్‌.లక్ష్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

సింథటిక్‌ కెమికల్‌కు అనుమతులు ఇవ్వొద్దు
పోస్టర్‌ను విడుదల చేస్తున్న నాయకులు

- కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి జిల్లా కన్వీనర్‌ ఎస్‌.లక్ష్మయ్య

మరికల్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): చిత్తనూరు ఇథనాల్‌ కంపెనీలో అమోనియం లాంటి తొమ్మిది రకాల సింథటిక్‌ కెమికల్స్‌కు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వొద్దని కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి జిల్లా కన్వీనర్‌ ఎస్‌.లక్ష్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇథనాల్‌ కంపెనీని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం చిన్నచింతకుంట తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిర్వహించతల పెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆదివారం మండల కేంద్రంలో ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ కోయిల్‌సాగర్‌ పూర్తి ఆయకట్టు 52వేల ఎకరాల వ్యవసాయానికి నీళ్లు ఇచ్చే వరకు ఈ కంపెనీకి నీళ్లు ఇవ్వొద్దని, రైతులు, పోరాట కమిటీ ప్రతి నిధులపై పెట్టిన రౌడీషీట్లను వెంటనే ఎత్తి వేయాలని కోరారు. కాలుష్య కారక చిత్తనూరు ఇథనాల్‌ కంపెనీ రద్దు చేయమని గత మూడు సంవత్సరాలుగా రైతులు ఉద్యమిస్తుంటే ఆ ఉద్యమాన్ని లాఠీచార్జి, అక్రమ కేసులతో జైలు నిర్భంధాలతో అణిచివేశారన్నారు. ప్రస్తుతం ఆ కంపెనీలోనే ప్రమాదకరమైన తొమ్మిది రకాల సింథటిక్‌ కెమికల్స్‌ను ఏర్పాటు చేయడం కోసం కంపెనీ యజమాన్యం ప్రయత్నిస్తోందని పేర్కొ న్నారు. కెమికల్స్‌ ఏర్పాటుకు అనుమతులిస్తే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో గాలి, భూగర్భ జలాలు కలుషితమై మనుషులు జీవించలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక నాయకులు ఎం.వెంకట్రాములు, ఎం.సుదర్శన్‌, ఎక్లాస్‌పూర్‌ రైతు మండలి నాయకులు రాంచంద్రయ్య, మల్లేష్‌, మధు, కేఎన్‌పీఎస్‌ నాయకులు లక్ష్మయ్య తదితరులున్నారు.

Updated Date - Feb 23 , 2025 | 11:32 PM