ఢీ అంటే ఢీ
ABN , Publish Date - Jan 17 , 2025 | 12:06 AM
పోటాపోటీగా ఎద్దుల బండ లాగుడు పోటీలు కొనసాగాయి. పొట్టేళ్లు ఢీ అంటే ఢీ అన్నట్లుగా తలపడ్డాయి.

- ఉత్సాహంగా బండ లాగుడు పోటీలు
- హోరాహోరీగా పొట్టేళ్ల పందేలు
ఇటిక్యాల, జనవరి (ఆంధ్రజ్యోతి) 16 : పోటాపోటీగా ఎద్దుల బండ లాగుడు పోటీలు కొనసాగాయి. పొట్టేళ్లు ఢీ అంటే ఢీ అన్నట్లుగా తలపడ్డాయి. జోగుళాంబ గద్వాల జిల్లా, ఇటిక్యాల మండలంలోని వావిలాల గ్రామంలో, శివాంజనేయ స్వామి ఉత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన ఈ పోటీలు ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగాయి. బండలాగుడు పోటీలు, ఆరు పళ్ల విభాగంలో 14 జతల ఎద్దులు పాల్గొన్నాయి. పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లా, పాణ్యం తాలూకా, పిన్నాపురం గ్రామానికి చెందిన విజయమ్మ గారి వెంకట కృష్ణయ్య ఎద్దులు ప్రథమ స్థానంలో నిలిచి రూ. 40 వేల నగదు బహుమతిని సాధించాయి. ఇటిక్యాల మండలం, సాతర్ల గ్రామానికి చెందిన హర్షద్‌పాషా ఎద్దులు రెండవ స్థానంలో నిలిచి రూ. 30 వేలు, యశ్వంత్‌యాదవ్ ఎద్దులు మూడవ స్థానంలో నిలిచి రూ. 20 వేలు సొంతం చేసుకున్నాయి. ఆ తర్వాత జరిగిన పోట్టేళ్ల పెందెంలో నంద్యాల జిల్లా తిమ్మాపురం హనుమ పొట్టేలు ప్రథమ స్థానంలో నిలిచి,రూ. 20వేలు, బింగిదొడ్డి పరశురాములు పొట్టేలు ద్వితీయ స్థా నంలో నిలిచి రూ. 15 వేల బహుమతి పొందాయి. కోడుమూరు ముల్లగుర్తి భైరవ పొట్టేలు మూడవ స్థానంలో నిలిచి రూ. 10 వేలు, ఆయజ నర్సింహ పొట్టేలు నాలుగవ స్థానం దక్కించుకొని ఐదువేల రూపాయల బహుమతి పొందాయి. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎద్దులు, పొట్టేళ్ల యజమానులకు నగదు, జ్ఞాపికలను అందించారు. పోటీలను తిలకించేందుకు చుట్టు గ్రామాల ప్రజలు తరలివచ్చారు.