చిగురిస్తున్న ఆశలు
ABN , Publish Date - Feb 03 , 2025 | 11:42 PM
ఎన్నో ఏళ్లు గా ఎదురు చూసిన గుర్రంగడ్డ ప్రజల చిరకాల కోరిక నెరవేరే సమయం ఆసన్నమైంది.

- ఆరేళ్ల క్రితం గుర్రంగడ్డ వంతెన పనులకు శంకుస్థాపన
- బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నత్తకు నడక నేర్పే విధంగా సాగిన పనులు
- కాంట్రాక్టు మార్పుతో పనుల్లో పెరిగిన వేగం
గద్వాల, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): ఎన్నో ఏళ్లు గా ఎదురు చూసిన గుర్రంగడ్డ ప్రజల చిరకాల కోరిక నెరవేరే సమయం ఆసన్నమైంది. నిబంధనల ప్రకారం స్వప్న కన్‌స్ట్రక్షన్‌ను తొలగించి 60సీ కింద కొత్త కాంట్రాక్టర్ శ్రీనివాసం ఇన్‌ఫ్రా డెవలప్‌మెంటు సంస్థకు వంతెన నిర్మాణ పనులను అప్ప గించారు. కొత్తగా కాంట్రాక్టు తీసుకున్న వారు మూడు నెలల నుంచి పనుల్లో వేగం పెంచేశారు. వంతెనకు 34 పిల్లర్లు అవసరం ఉండగా 26 పిల్లర్ల పనులు పూర్తి చేశారు. ఈ ఏడాది దాదాపు 70శాతం పనులను పూర్తి చేసి వచ్చే జూన్ నాటికి మిగిలిన పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు సంస్థ ఎండీలు తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆరేళ్లుగా నిర్మాణ పనులు నత్తకు నడక నేర్పేవిధంగా సాగాయి. రెండు సా ధారణ ఎన్నికలు పూర్తయిన పనులు మాత్రం ఒక రూపానికి రాకపోవడంతో దీవిగ్రామ ప్రజలు ఆశ లు వదిలేసుకున్నారు. కానీ అధికారులు కాంట్రాక్ట రును మార్చడం, పనుల్లో వేగం పెరగడంతో వారి లో ఆశలు చిగురించాయి.
ఆరేళ్లుగా ఆగుతూ.. సాగుతూ...
దీవి గ్రామం గుర్రంగడ్డ ప్రజలు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసి 2018 ఎన్నికల సందర్భంగా వంతెన మంజూరు చేయించుకున్నారు. ఆ వెంటనే అప్పటి మంత్రి నిరంజన్‌రెడ్డి వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తుమ్మిళ్ల ప్రాజెక్టు ను నిర్మించే కాంట్రాక్టరే దీనిని కూడా నిర్మించేం దుకు ముందుకు రావడంతో పనులు త్వరగా పూర్తి చేస్తారని గ్రామస్థులు సంతోషపడ్డారు. కానీ ఆరేళ్లుగా పనులు నత్తకు నడక నేర్పే విధంగా సాగాయి. అధికారుల నోటీసులకు కూడా స్పందిం చక పోవడంతో కాంట్రాక్టర్‌ను మార్చాల్సి వచ్చింది.
ఏళ్లుగా పుట్టీ ప్రయాణం...
గుర్రంగడ్డ గ్రామ ప్రజలు ఏళ్లుగా పుట్టీ ప్రయాణం చేశారు. మారుతున్న కాలంలో ఆ ఊరు యువకులకు పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో పెళ్లిళ్ల భయం పట్టుకున్నది. 2009లో వచ్చిన భారీ వరదలకు తెల్లరాళ్ల గుట్టనే గ్రామస్థులను కాపాడింది. అప్పటి మాజీ మంత్రి డీకే అరుణ నావికాదళం బోటులో వెళ్లి ధైర్యం చెప్పింది. అప్పటి నుంచే వంతెన నిర్మాణానికి బీజం పడింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వంతెన మంజూరు చేసినా కార్యరూపం దాల్చలేదు. పుట్టీ ప్రయాణం ప్రమాదమని అధికారులు పవర్ బోటును అందించారు. నేటికీ పవర్‌బోటులోనే ప్రయాణిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. వంతెన నిర్మాణ పనులలో వేగం పుంజుకోవడంతో బయటి ప్రపంచంతో సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి పుట్టీ ప్రయాణానికి పులిస్టాప్ పడే అవకాశం ఉంది.
80శాతం పనులను పూర్తి చేస్తాం
పాత కాంట్రాక్టు స్థానంలో కొత్తవారికి పనులను అప్పగించాం. వారు పనులను వేగంగా చేస్తున్నారు. దాదాపు పిల్లర్లను పూర్తి చేస్తున్నారు. ఈ ఏడాది వరదల సమయానికి 80శాతం పనులను పూర్తి చేస్తాం. వచ్చే ఏడాదికి వంతెన అందుబాటులోకి తీసుకువస్తాం.
- ఖాజా జుబేరుద్దీన్, ఈఈ, జూరాల ప్రాజెక్టు