రైతులకు మద్దతుగా బీఆర్‌ఎస్
ABN , Publish Date - Jan 06 , 2025 | 11:37 PM
సమగ్ర రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చే వరకు రైతులకు మద్దతుగా బీఆర్‌ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ అన్నారు.

- రైతు భరోసా ఇవ్వాలని మహిళా కూలీల నిరసన
- మద్దతు తెలిపిన బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్
వనపర్తి రూరల్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి):సమగ్ర రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చే వరకు రైతులకు మద్దతుగా బీఆర్‌ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ అన్నారు. సోమవారం వనపర్తి మండలంలోని పెద్దగూడెంలో రైతు భరోసా ఇవ్వాలని నారుమడిలో నిరసన తెలుపుతున్న మహిళా రైతులకు పార్టీ నాయకులతో కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని చౌరస్తాలో వరంగల్ డిక్లరేషన్ హామీపత్రాలను పార్టీ నాయకులతో కలిసి భోగి మంటలో వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారం కోసం ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి నేటి ప్రభుత్వం ఒక్కటి కూడా నెరవేర్చ కుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. ముఖ్యంగా రైతులకు సమగ్ర రుణమాఫీ చేస్తామని చెప్పి అరకొరగా చేసి చేతులు దులుపుకున్నదని ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం గత యాసంగిలో ఎగ్గొట్టిన పంట పెట్టుబడి రూ.2,500, వానాకాలనికి సంబంధించి రూ.7,500, ఈ సీజన్‌లో ఇవ్వాల్సిన రూ. 7,500 మొత్తం కలిసి రూ.17,500 చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్ర మంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు వాకిటి శ్రీధర్, పలుస రమేష్‌గౌడ్, కురుమూర్తి యాదవ్, విజయ్‌కుమార్, నందిమల్ల అశోక్ ఉన్నారు.