Share News

తండాలకు బీటీ రోడ్లు పడేనా?

ABN , Publish Date - Jan 04 , 2025 | 11:24 PM

జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న గిరిజన తండాలకు కనీస రోడ్డు సౌకర్యాలు లేక ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తండాలకు బీటీ రోడ్లు పడేనా?
అమిస్తాపూర్‌ శివారులో ఉన్న వసురాంతండా (ఫైల్‌)

- బీటీ రోడ్లకు నోచుకోని గిరిజన తండాలు

- పనులు ప్రారంభించారు.. మధ్యలోనే వదిలేశారు

భూత్పూర్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న గిరిజన తండాలకు కనీస రోడ్డు సౌకర్యాలు లేక ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామ పంచాయతీ నుంచి మునిసిపాలిటీగా మారితే తండాలకు రోడ్డు సౌకర్యాలతో పాలు పలు మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని గిరిజనులు ఆశపడినా.. వారికి నిరాశే ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే.. భూత్పూర్‌ గ్రామం 2018లో మునిసిపాలిటీగా ఏర్పడింది. మునిసిపాలిటీగా ఏర్పడి దాదాపు ఆరేళ్లు అవుతున్నా చుట్టూ పక్కల ఉన్న ఎనిమిది గిరిజన తండాలకు కనీస రోడ్డు సౌకర్యాలు లేవు. మునిసిపల్‌ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌ ప్రత్యేక శ్రద్ధ కనబరిచి తండాలకు రూ.12.52 కోట్ల నిధులతో బీటీ రోడ్లను మంజూరు చేయించారు. మునిసిపాలిటీ పరిధిలో ఉన్న వసురాంతండా, గేగ్యాతండా, నల్లగుట్ట తండా, వాల్యతండా, మిట్యా తండా, నక్కలబండ తండా, నర్సింగాపూర్‌, చెర్లతండాతో పాటు మరికొన్ని తండాలకు బీటీ రోడ్డు వేయడానికి గత ఏడాది కాలంలో ప్రజాప్రధినిధులు శంకుస్థాపన చేశారు. అయితే నర్సింగాపూర్‌, చెర్లతండాలకు సంబంధించి బీటీ రోడ్డు పూర్తి అయ్యింది. మిగిలిన వసురాంతండా, నల్లగుట్ట, వాల్య తండాలకు సంబంధించి 50 శాతం పనులు పూర్తి అయ్యాయి. మిగిలిన తండాలకు నిధులు మంజూరైనా గుత్తేదారు నిర్లలక్ష్యమో, అధికారుల అలసత్వమో తెలియదు కానీ, బీటీ రోడ్డు పనులు ముందుకు సాగడం లేదని ఆయా గిరిజన తండాల వారు వాపోతున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్డు పనులను వెంటనే పునర్‌ ప్రారంభించాలని ఆయా తండాల గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - Jan 04 , 2025 | 11:24 PM