అచ్చంపేటకు అచ్చేదిన్
ABN , Publish Date - Jan 06 , 2025 | 11:16 PM
వెనుకబడిన నల్లమల అటవీ ప్రాంతంలో అంతర్భాగంగా ఉన్న అచ్చంపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పేర్కొన్నారు. నీతి, నిజాయతీ, నిరాడంబరతకు మారు పేరైన పుట్టపాగ మహేంద్రనాథ్ ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గానికి శాసన సభ్యుడిగా రెండు దఫాలు ఎన్నిక కావడం తన అదృష్టమన్నారు.

నల్లమల సమగ్రాభివృద్ధే లక్ష్యం
దివంగత పుట్టపాగ మహేంద్రనాథ్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తా
ఉమామహేశ్వరం రిజర్వాయర్‌తో లక్ష ఎకరాలకు సాగునీరు
ఈ నెలాఖరులో శంకుస్థాపన
రెండు దశల్లో రూ.2,300 కోట్లతో పనులు
నియోజకవర్గంలో ప్రతీ సెంటు, గుంటకు సాగునీరు
రూ.7,700 కోట్లతో నల్లమల హైవే కారిడార్
ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
వెనుకబడిన నల్లమల అటవీ ప్రాంతంలో అంతర్భాగంగా ఉన్న అచ్చంపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పేర్కొన్నారు. నీతి, నిజాయతీ, నిరాడంబరతకు మారు పేరైన పుట్టపాగ మహేంద్రనాథ్ ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గానికి శాసన సభ్యుడిగా రెండు దఫాలు ఎన్నిక కావడం తన అదృష్టమన్నారు. దళితులు, వెనుకబడిన వర్గాల కోసం అమ్రాబాద్‌లో పుట్టపాగ మహేంద్రనాథ్ నెలకొల్పిన హాస్టల్లో చదువుకుని డాక్టర్‌గా, రాజకీయ నాయకునిగా ఎదగడం తన పూర్వజన్మ సుకృతమని చెప్పారు. అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో నాలుగేళ్లల్లో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి, తన నిబద్దతతను నిరూపించుకుంటానని చెప్పారు. సోమవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి ఇంటర్వూ ఇచ్చారు. ఆ వివరాలు..
- నాగర్‌కర్నూల్, (ఆంధ్రజ్యోతి)
వెనకబడిన అచ్చంపేట నియోజకవర్గం నుంచి రెండవ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ప్రాంత అభివృద్ధి పట్ల మీకు ప్రత్యేకమైన విజన్ ఉందా?
కచ్చితంగా ఉంది. దళిత సామాజిక వర్గానికి చెందిన తనను రెండవసారి ఎన్నుకున్నందుకు ఈ ప్రాంత ప్రజలకు జన్మాంతం రుణపడి ఉంటా. దళితులు, అణగారిన వర్గాలు, చెంచులు అధిక సంఖ్యలో ఉన్న ఈ నియోజకవర్గానికి సేవ చేయకుంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతాను. ఇక్కడి నుంచి నేను గెలవడం, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం నా అదృష్టం. నల్లమల బిడ్డ ముఖ్యమంత్రి కావడం నాకు కలిసొచ్చే అంశాలు. నేను కూడా చొరవ చూపి ఈ నియోజకవర్గంలో అన్ని వర్గాల సహకారం తీసుకుంటే అచ్చంపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కష్టతరమైన అంశమేమీ కాదు. పార్టీలకు అతీతంగా సహకరిస్తే రాబోయే నాలుగేళ్లల్లో నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి.
నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి?
దివంగత పుట్టపాగ మహేంద్రనాథ్ కాలంలో అచ్చంపేట నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి కృషి జరిగింది. ఆయన స్ఫూర్తితోనే ఈ అంశానికి ఇతోధిక ప్రాధాన్యం ఇస్తున్నాను. మొదటిసారి నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా అమ్రాబాద్‌లో డిగ్రీ కాలేజ్ నెలకొల్పా. మున్ముందు లింగాల, పదర, చారకొండ మండలాల్లో ప్రభుత్వ పరంగా జూనియర్ కళాశాలలు నెలకొల్పాలనే యోచన ఉంది. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలను దాదాపు 20 కోట్ల రూపాయల ఖర్చుతో కొత్తగా నిర్మించనున్నాం. అచ్చంపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అమ్రాబాద్, అచ్చంపేటలో పీజీ కాలేజ్ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించాం. మన్ననూర్‌లో 12 కోట్ల రూపాయల వ్యయంతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ త్వరలో ప్రారంభం కానుంది. నియోజకవర్గంలో విద్యాపరంగా పది మందికి పనికొచ్చి, పది కాలాల పాటు నిలిచి ఉండే పనులు చేయాలనేది నా సంకల్పం.
వైద్య పరంగా నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సదుపాయాలు కల్పించనున్నారు?
నేను స్వతాహాగా డాక్టర్‌ను. వెనుకబడిన ప్రాంతాల ప్రజల కష్టాలు నాకు తెలుసు. రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే అచ్చంపేటలో మెగా సర్జికల్ క్యాంపు నిర్వహించి గుండె, మెదడు ఆపరేషన్లు మినహాయించి 762 సర్జరీలు చేశా. మళ్లీ ఈ నెల 24, 25న సర్జికల్ క్యాంపు నిర్వహించి దాదాపు వెయ్యి మందికి శస్త్రచికిత్స చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నాం. అచ్చంపేట ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్, ఐసీయూ, ఇటెన్సివ్ కేర్ యూనిట్, వెంటిలేటర్ సపోర్టు సదుపాయాలు కల్పిస్తాం. సీటీ స్కాన్ సేవలను కూడా ప్రతిపాదించాను. మన్ననూర్‌లో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ నెల రోజుల్లో ప్రారంభం కానుంది. ట్రామా కేర్ యూనిట్ కూడా ప్రారంభించనున్నాం. అమ్రాబాద్‌లో ట్రైబల్ ఏరియా ఆసుపత్రి నిర్మించడం ద్వారా ఈ ప్రాంత ప్రజానీకానికి విస్తృతమైన, అధునాతనమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి.
అచ్చంపేట లిఫ్టు ఇరిగేషన్ స్కీం ఎంత వరకు వచ్చింది?
ఇందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద ఇతమిద్దమైన ప్రణాళిక ఉంది. అచ్చంపేట ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలో ప్రతీ సెంటు, గుంటకు నీరందించే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఉమామహేశ్వరం రిజర్వాయర్ పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారు. దీని ద్వారా మొదటి దశలో రూ.1532 కోట్లు, రెండో దశలో దాదాపు రూ.700 కోట్ల ఖర్చు చేసి బల్మూరు, అచ్చంపేట, అమ్రాబాద్, పదర, లింగాల, తెలకపల్లి మండలాల్లో దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరందిస్తాం. నియోజకవర్గంలో చెరువులు, కుంటల అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రణాళికను రూపొందించి నిధులు తెచ్చే ప్రయత్నాలను చేస్తున్నాం.
నల్లమలలో టూరిజం అభివృద్ధికి ఎలాంటి ప్రతిపాదనలు చేశారు?
వెనుకబడిన అచ్చంపేట నియోజకవర్గంలో స్థానికంగా ఉపాఽఽధి అవకాశాలు మెరుగుపర్చాలంటే పర్యాటకాన్ని ప్రధాన ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందు కోసం కార్యాచరణను రూపొందించాం. అటవీ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి 20 ప్రాంతాలను ప్రధానంగా గుర్తించాం. వీటిలో టూరిజం అభివృద్ధి ద్వారా వచ్చే ఆదాయంలో చెంచులకు కూడా 30 శాతం భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించాం. ఏడాదికోసారి మాత్రమే కొనసాగే సలేశ్వరం సందర్శనను తొమ్మిది నెలల పాటు కొనసాగించాలని నిర్ణయించాం. టూరిజం, ఫారెస్టు అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఈ కార్యాచరణను పూర్తి చేస్తారు. అక్కమహాదేవి గుహలు, మల్లెలతీర్థం, వ్యూపాయింట్‌లను కూడా సుందరంగా తీర్చిదిద్ది పర్యాటకులకు విస్తృతమైన సౌకర్యాలు కల్పించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నల్లమలలో 20 పర్యాటక కేంద్రాలను ప్రపంచ దృష్టిని ఆకర్శించేలా తీర్చిదిద్దనున్నాం. రనూ.7,700 కోట్లతో నల్లమల గుండా నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ తలమానికంగా నిలవనుంది.
అచ్చంపేట పట్టణాభివృద్దికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
అచ్చంపేటలో పట్టణీకరణ ఇటీవల బాగా పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏడెకరాల్లో రూ.పది కోట్ల వ్యయంతో వైఎ్‌సఆర్ పార్కు నిర్మిస్తున్నాం. గాంధేయవాది దివంగత పుట్టపాగ మహేంద్రనాథ్ పేరిట రెండు కోట్ల రూపాయలతో రవీంద్రభారతిని నిర్మించనున్నాం. సీసీ రోడ్లకు అధిక ప్రాధాన్యతనిచ్చి సత్వరం పూర్తి చేయాలని యాక్షన్ ప్లాన్‌ను రూపొందించుకున్నాం.
నల్లమల తురుపు జాతి పశువులు తెలంగాణ గిత్తగా ఎందుకు గుర్తించబడటం లేదు?
ఇందుకు సంబంధించిన కార్యాచరణ కొనసాగుతోంది. అనేక ప్రాధాన్యతలు కలిగిన తురుపు జాతి గిత్తలు, ఆవులపై భారత ప్రభుత్వం చేసిన పరిశోధనలు, డీఎన్‌ఏ రిపోర్టులు ఈ పశువుల ప్రత్యేకతలపై సవివరంగా ఉన్న నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందించడం జరిగింది. త్వరలోనే ఈ పశువులను తెలంగాణ గిత్తగా ప్రకటించడంతోపాటు మన్ననూర్‌లో వెటర్నరీ, పాలిటెక్నిక్‌లు పెట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.
దోమలపెంట, ఈగలపెంట పేర్లు మా రుస్తున్న విషయం వాస్తవమేనా?
ఈ విషయం వాస్తవమే. ఆ రెండు గ్రామాల చారిత్రక ప్రాధాన్యత గురించి అధ్యయనం చేసిన తర్వాత పేర్లు మార్చాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి వెళ్లాయి. త్వరలో అధికారిక ఉత్తర్వులు కూడా రానున్నాయి. ఇక ముందు దోమలపెంట బ్రహ్మగిరిగా, ఈగలపెంట కృష్ణగిరిగా పిలువబడుతాయి.