ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.12 కోట్లు
ABN , Publish Date - Jan 18 , 2025 | 11:24 PM
నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం అబాసుపాలవుతోంది. పథకం కింద ఆపరేషన్ చేసిన ఆస్పత్రులకు రావలసిన బకాయిలను ఇవ్వడంలో ప్రభుత్వం ఉదాసినత ప్రదర్శిస్తోంది.

ఏడాదిగా ఆస్పత్రుల యాజమాన్యాల ఎదురుచూపులు
విడుదల చేసేందుకు జాప్యం చేస్తున్న ప్రభుత్వం
ప్రైవేటు దవాఖానాల్లో నిలిచిన సేవలు
అత్యవసరమై చేస్తే అడ్డదారులు
మహబూబ్‌నగర్(వైద్యవిభాగం) జనవరి 18: నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం అబాసుపాలవుతోంది. పథకం కింద ఆపరేషన్ చేసిన ఆస్పత్రులకు రావలసిన బకాయిలను ఇవ్వడంలో ప్రభుత్వం ఉదాసినత ప్రదర్శిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు దాదాపు రూ.12 కోట్లు ఏడాదిగా పెండింగ్ ఉన్నాయి. దాంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రైవేటు యాజమాన్యాలు లబోదిబోమంటున్నాయి. దీంతో తమ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేస్తున్నామంటూ ప్లెక్సీలు కూడా ఏర్పాటు చేశాయి.
పేరుకుపోయిన బకాయిలు..
మహబూబ్‌నగర్ జిల్లాలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు దా దాపు 16 వరకు ఉండగా, ప్రభుత్వ ఆస్పత్రులు రెం డు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కలి పి ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.12 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో ప్ర భుత్వ ఆస్పత్రులకు రూ. 1.50 కోట్లు, ప్రైవేటు ఆస్పత్రులకు దాదాపు రూ. 10.50 కోట్లు పెండింగ్ ఉన్నాయి. గతంలో ఉన్న బకాయిలు చెల్లించడంతో కొంత ఉపశమనం కలిగినప్పటికీ, ఏడాదిగా చెల్లించడం లేదు.
అదనంగా వసూలు
ప్రభుత్వం సకాలంలో నిధులు మంజూరు చేయకపోవడంతో ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్లు చేయడానికి ప్రైవేటు ఆస్పత్రులు ఆసక్తి చూపడం లేదు. గత్యంతరం లేక చేస్తే.. ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ కాకుండా అదనంగా డబ్బులు వసూలు చేస్తూ, అడ్డదారులు తొక్కుతున్నాయి. ప్రభుత్వం నుంచి అందించే ఆపరేషన్ సామగ్రి నాసిరకంగా ఉంటున్నాయని, అదనంగా డబ్బులు చెల్లిస్తే నాణ్యమైన పరికరాలు వేస్తామని చెబుతున్నాయి. ఒక్కో ఆపరేషన్‌కు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ డబ్బులు కూడా క్లెయిమ్ చేసుకుంటున్నాయి.
ప్రభుత్వ ఆస్పత్రులపై చిన్నచూపు..
ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రభుత్వమే చిన్నచూపు చూస్తోంది. ఒక్క ఆరోగ్యశ్రీ కేసు కూడా ప్రైవేటుకు వెళ్లనీయొద్దని, అన్ని కేసులకూ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స చేయాలని చెబుతున్నా, నిధులు మంజూరు చేయడంలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తోంది. ప్రైవేటు ఆస్పత్రులకు ఐదారు నెలలకు డబ్బులు ఇస్తుండగా, అదే ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రం ఆరు నుంచి ఎనిమిది నెలలుగా పెండింగ్ బకాయిలు పేరుకుపోయాయి. దీంతో ప్రైవేటులో కొనుగోలు చేసిన వైద్య పరికరాలకు డబ్బులు ఇవ్వాలని ఒత్తిళ్లు కూడా వస్తున్నాయి.
ప్రభుత్వం కొద్ది కొద్దిగా వేస్తూనే ఉంది..
ప్రభుత్వం గత కొన్ని నెలలుగా కొద్ది కొద్దిగా నిధులు వేస్తూనే ఉంది. అన్ని ఒకేసారి వేయడం కొంత ఇబ్బందిగా ఉండటం వలన కొద్దో గొప్పో విడుదల చేస్తోంది. పెండింగ్ నిధులు కూడా ఈ నెలలో వేసే అవకాశాలు ఉన్నాయి. అన్ని కేసులు చేయకుండా ఉండొద్దని, ఎమర్జెన్సీ కేసులు చేయాలని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలకు తెలియజేశాం. అత్యవసర కేసులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రులకు కూడా నెల రోజుల క్రితం నిధులు విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న నిధులు త్వరలో వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
- డాక్టర్ స్వప్న, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త