Share News

అందాల నల్లమలలో ఆనంద విహారం

ABN , Publish Date - Jan 18 , 2025 | 12:03 AM

నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని నల్లమల అడవిలో, కృష్ణానది తీరాన ఉన్న సుందర ప్రదేశాలను సందర్శించే అవకాశం అందుబాటులోకి వచ్చింది.

అందాల నల్లమలలో ఆనంద విహారం

- పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

- నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం

- అక్కమహాదేవి గుహల సఫారీ, ట్రెక్కింగ్‌ ప్రారంభం

దోమలపెంట, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని నల్లమల అడవిలో, కృష్ణానది తీరాన ఉన్న సుందర ప్రదేశాలను సందర్శించే అవకాశం అందుబాటులోకి వచ్చింది. అందుకోసం ఈకో టూరిజం పేరుతో అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సదుపాయం కల్పించింది. మన్ననూర్‌ రేంజ్‌ పరిధిలో పర్హాబాద్‌ జంగిల్‌ సఫారీ ఇప్పటికే కొనసాగుతోంది. అదే తరహాలో దోమలపెంట రేంజ్‌ పరిధిలోని అక్క మహాదేవి గుహలతో పాటు, ఆక్టోఫస్‌ వ్యూ పాయింట్‌, వజ్రాల మడుగు, వాచ్‌టవర్‌ ప్రాంతాల సందర్శనకు ఈ నెల 13న మరో సఫారీ ట్రెక్కింగ్‌ ప్రారంభమైంది. వివరాలిలా ఉన్నాయి.

బుకింగ్‌ చేసుకోవడం ఇలా..

ఆసక్తి గల పర్యాటకులు అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు పోర్టల్‌నుంచి సఫారీని బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కమహాదేవి గుహల ఆప్షన్‌ను ఎంచుకొని, పర్యట నకు అనుకూలమైన రోజులను ఎంపిక చేసుకోవాలి. ఇలా బుక్‌ చేసుకున్న వారు ఎంచుకున్న తేదీల్లో మొదటి రోజు మఽధ్యాహ్నం రెండు గంటల వరకు దోమలపెంటలోని అటవీశాఖ కార్యాలయానికి చేరుకో వాలి. అక్కడ వన విహంగ గెస్ట్‌హౌస్‌లో వారు ఎంచు కున్న గదులను కేటాయిస్తారు. అనంతరం సఫారీ వాహనంలో కృష్ణానది తీరాన ఉన్న ఆక్టోపస్‌, వజ్రాల మడుగు, వాచ్‌టవర్‌ ప్రాంతాలను చూపిస్తారు. అక్క డి నుంచి వంపులు తిరుగుతూ ప్రవహిస్తున్న కృష్ణా నది అందాలను తిలకించవచ్చు. అనంతరం విశ్రాంతి కోసం గెస్ట్‌హౌస్‌కు తీసుకొస్తారు. అక్కడ పర్యాటకులు తమకు ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్‌ చేస్తే ఈడీసీ కమిటీ వారు సిద్ధం చేస్తారు. అందుకు అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. రెండవ రోజు ఉదయం 6.30 గంటలకు సఫరీ ప్రారంభం అవుతుంది. ఎని మిది గంటల సమయానికి కొండ అంచు (అక్క మహాదేవి గేట్‌) వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి 560 మీటర్లు కాలినడకన కొండ దిగి గుహలను సందర్శిస్తారు. ఆ తర్వాత మళ్లీ కొండపైకి ఎక్కి, వాహనాల్లో మధ్యాహ్నం 12 గంటల సమయానికి వనవిహంగ గెస్ట్‌హౌస్‌కు చేరడంతో సఫారీ ముగుస్తుంది. అయితే గుట్ట దిగలేని వారు ఇన్‌క్లాండ్‌ టన్నెల్‌ వద్దకు చేరుకుంటే అక్కడి నుంచి తెలంగాణ టూరిజం బోటులో అక్కమహాదేవి గుహలకు వెళ్లొచ్చు. అందుకు టికెట్‌ ధర పెద్దలకు రూ. 650, పిల్లలకు రూ. 530 చెల్లించాల్సి ఉంటుంది. నదిలో రానుపోను రెండు గంటల బోటు ప్రయాణం మరో గంట దర్శన సమయం ఉంటుంది. పర్యటన సందర్భంగా అడవిలోని చెట్లు, జంతువులు, పురాతన ఆలయాల విశిష్ఠతలను తెలిపేందుకు గైడ్‌ తోడుగా ఉంటారు.

ప్యాకేజీ ధరలు ఇలా..

వన విహంగ గెస్ట్‌హస్‌లో నాలుగు కాటేజీలు ఉన్నాయి. ఒక్క కాటేజీలో ఇద్దరికి అవకాశం ఉంటుంది. వసతులను బట్టి ధరలు ఉన్నాయి. మొదటి అంతస్తు లోని కాటేజీకి రూ. 8,000, మరో కాటేజీకి రూ. 7,500. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న కాటేజీకి రూ. 7,500, మరో కాటేజీకి రూ. 6,500 చెల్లించాల్సి ఉంటుంది. ఎనిమిది సంవత్సరాల వయసు పైబడిన పిల్లలకు రూ. 1,700 చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

Updated Date - Jan 18 , 2025 | 12:03 AM