Share News

ఎగసిపడ్డ మంటలకు ఏడాది

ABN , Publish Date - Jan 12 , 2025 | 11:04 PM

బోల్తా పడ్డ బస్సులో ఎగసిపడ్డ మంటలకు సరిగ్గా నేటికి ఏడాది అవుతున్నది. సంక్రాంతి పర్వదినాన ఈ ఘటన రాకాసి మంటలు కోరలు చాస్తూ బస్సు అంతటా వ్యాపించింది.

 ఎగసిపడ్డ మంటలకు ఏడాది
ఏడాది నుంచి ఘటన స్థలంలోనే ఉన్న ప్రమాదానికి గురైన బస్సు

- గత ఏడాది బీచుపల్లి దగ్గర అగ్నికి ఆహుతైన బస్సు

- మంటల్లో మహిళ సజీవ దహనం

ఎర్రవల్లి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): బోల్తా పడ్డ బస్సులో ఎగసిపడ్డ మంటలకు సరిగ్గా నేటికి ఏడాది అవుతున్నది. సంక్రాంతి పర్వదినాన ఈ ఘటన రాకాసి మంటలు కోరలు చాస్తూ బస్సు అంతటా వ్యాపించింది. ఈ బస్సులో చిక్కుకున్న ఓ మహిళ సజీవదహనంతో కాలిబూడిదై పోయింది. ఈ హృదయవిదారక ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను కలవరపరిచింది. గత ఎడాది సంక్రాంతి పండుగ ముందు జనవరి 12వ తేదీ అర్థరాత్రి హైదరాబాద్‌ కూకట్‌పల్లి నుంచి ప్రేవేట్‌ ట్రావెల్స్‌ బస్సు చిత్తూరుకు ప్రయాణికులతో బయలుదేరింది. బస్సులో 42మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై బీచుపల్లి దాటాక బీచుపల్లి, ఎర్రవల్లి మధ్యలో పదో బెటాలియన్‌ సమీపంలో తెల్లవారుజామున 2.30 గంటలకు డ్రైవర్‌ నిద్రావస్థ కారణంగా అదుపుతప్పి బస్సు బోల్తా పడింది. షార్ట్‌ సర్క్యూట్‌లో మంటలు చేలరేగాయి. ఆ బస్సుకు అంటుకున్న మంటలు పెద్దవి కాక మునుపే ప్రయాణికుల్లో ఎలాగోలా బయటపడ్డారు. మరికొందరు ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు. పక్కనే ఉన్న హర్వేస్టర్‌ గ్యారేజి కార్మికులు పెట్రోల్‌ బంక్‌ వర్కర్లు స్పందించారు. బస్సు అద్దాలను పగులగొట్టి ప్రయాణికులను కాపాడారు. కానీ ఏపీలోని చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం పుత్తమర్ల గ్రామానికి చెందిన మాలతి మాత్రం బస్సులోనే ఇరుక్కుపోవడం అంతలోపే బస్సులో మంటలు పెద్దగా వ్యాపించడంతో ఆమెను కాపాడటం సాధ్యపడలేదు. వీరు ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నప్పటికీ సంక్రాంతి పండుగకు ఈమె సొంతూరుకు వెళుతుంది. బాధిత కుటుంబానికి మాత్రం ఇది వరకు గత ప్రభుత్వం నుంచి కానీ ప్రేవేట్‌ ట్రావెల్స్‌ నుంచి కానీ ఎలాంటి పరిహారం అందలేదనే విషయాలు తెలిశాయి. మంటల్లో మసైపోయిన బస్సు మాత్రం నేటి వరకు సంఘటన స్థలంలోనే ఉండటంతో 44వ జాతీయ రహదారిపై వెళ్లే ప్రయాణికులు గత ఏడాది జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు..

కేసుకు చార్జిషీట్‌ వేశాం

గత ఏడాది జరిగిన బస్సు సంఘటన కేసును చార్జిషీట్‌ వేశామని తెలిపారు. ఈ కేసు కోర్టు పరిధిలో ఉందని, కేసు పురోగతి ఇంకా పెండింగ్‌లో ఉందన్నారు. కేసు ట్రయల్‌ అయ్యాకనే పరిష్కార చర్యలు ఉంటాయని ఎస్‌ఐ తెలిపారు. ప్రస్తుతం కూడా పండుగ సందర్భంగా రోడ్లపై అలాంటి రద్దీ ఉందని ప్రమాదాలను నివారించేందుకు సిబ్బందితో కలిసి వాహనాలను సవ్యంగా వెళ్లేందుకు కృషి చేస్తున్నామని, అతి వేగం నిద్రావస్థతో పాటు పరిమితికి మించి ప్రయాణించడంతో ఇలాంటి ఘటనలకు తావిస్తుందన్నారు. డ్రైవర్లకు అవగాహన కల్పిస్తూ జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్నామన్నారు.

- వెంకటేష్‌, ఎస్‌ఐ, ఇటిక్యాల

Updated Date - Jan 12 , 2025 | 11:05 PM