Share News

టైర్లు పేలి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం

ABN , Publish Date - Feb 24 , 2025 | 11:26 PM

44వ నెంబరు జాతీయ రహదారిపై మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయిన్‌పల్లి గ్రామ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు టైర్లు పేలడంతో మంటలు రేగాయి. ఈ మంటలతో బస్సు పూర్తిగా దగ్ధం అయ్యింది.

టైర్లు పేలి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం
దగ్ధమౌతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు

జడ్చర్ల మండలం మల్లెబోయిన్‌పల్లి గ్రామ సమీపంలో ఘటన

టైర్లు పగలి మంటలు రాగానే గమనించి డ్రైవర్‌ను అప్రమత్తం చేసిన ప్రయాణికులు

బస్సును రోడ్డు పక్కన ఆపి, మంటలు ఆర్పేందుకు ప్రయత్నం

మంటలను అదుపులోకి తెచ్చిన జడ్చర్ల ఫైర్‌స్టేషన్‌ సిబ్బంది

ప్రయాణికుల లగేజ్‌ దగ్ధం

జడ్చర్ల, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : 44వ నెంబరు జాతీయ రహదారిపై మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయిన్‌పల్లి గ్రామ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు టైర్లు పేలడంతో మంటలు రేగాయి. ఈ మంటలతో బస్సు పూర్తిగా దగ్ధం అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన సలీమ్‌ ట్రావెల్స్‌కు బస్సు ఆదివారం రాత్రి 8:30 గంటలకు బెంగళూరు నుంచి ఇద్దరు డ్రైవర్‌లతో 38 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరింది. తెల్లవారుజామున 4:30 గంటలకు మల్లెబోయిన్‌పల్లి సమీపంలోకి రాగానే బస్సు కుడివైపున ఉన్న టైర్లు పగలి మంటలు రేగాయి. ప్రయాణికులు మంటలను గమనించి, డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి, మంటలు ఆర్పేందుకు డ్రైవర్లు, ప్రయాణికులు ప్రయత్నించారు. సమీపంలోని పెట్రోల్‌ బంక్‌లో పనిచేసేవారు మంటలను అదుపులోకి తీసుకువచ్చే పరికరాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. జరిగిన సంఘటన సమాచారాన్ని పోలీసు శాఖకు, అగ్నిమాపక శాఖకు చేరవేశారు. సంఘటనా స్థలానికి జడ్చర్ల సీఐ కమలాకర్‌, ఎస్‌ఐ చంద్రమోహన్‌లతో పాటు జడ్చర్ల ఫైర్‌స్టేషన్‌ సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా ఈ సంఘటనలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులోని లగేజ్‌బాక్స్‌లో ఉన్న ప్రయాణికుల లగేజ్‌ అగ్నికి ఆహుతి అయ్యింది. జాతీయరహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకున్నారు. రేగిన మంటలను తాము గమనించని పక్షంలో పెద్ద ప్రమాదం జరిగి భారీగా ప్రాణనష్టం వాటిల్లేదని ప్రయాణికులు చెప్పారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ మేనేజర్‌ చెన్నారాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ కమలాకర్‌ తెలిపారు.

Updated Date - Feb 24 , 2025 | 11:26 PM