TG High Court: మహాశక్తి మందిరానికి దేవాదాయ శాఖ నుంచి మినహాయింపును పరిశీలించండి
ABN , Publish Date - May 21 , 2025 | 06:38 AM
కరీంనగర్ మహాశక్తి ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తేయాలన్న నోటీసును హైకోర్టు కొట్టివేసింది. ఆలయానికి మినహాయింపు ఇవ్వాలన్న అభ్యర్థనను పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, మే 20 (ఆంధ్రజ్యోతి): కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ధర్మకర్తగా ఉన్న కరీంనగర్ జ్యోతినగర్‌లోని మహాశక్తి ఆలయానికి అనుకూలంగా హైకోర్టులో తీర్పు వెలువడింది. ఈ ఆలయాన్ని దేవాదాయ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాలని, దేవాదాయ-ధర్మాదాయ శాఖ పరిధిలోకి తేవాలని సూచిస్తూ ఆ శాఖ అసిస్టెంట్ కమిషనర్ 2016లో ఇచ్చిన నోటీసును కొట్టివేసింది. దేవాదాయ చట్టంలోని సెక్షన్ 154 ప్రకారం సదరు ఆలయానికి మినహాయింపు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు ఆ ఆలయ ధర్మకర్త బండి సంజయ్ 2016లోనే పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించాలని తెలిపింది. మహాశక్తి ఆలయాన్ని చట్టప్రకారం నమోదు చేయాలని పేర్కొంటూ ఎండోమెంట్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ 2016లో ఇచ్చిన నోటీసును సవాల్ చేయడంతోపాటు ఆలయానికి మినహాయింపు ఇచ్చేలా ఆదేశించాలని ధర్మకర్త బండి సంజయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ధర్మాసనం విచారణ చేపట్టింది. సంజయ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ హంపీ విద్యారణ్య పీఠం అధిపతి విద్యారణ్య భారతి స్వామీజీ స్వతంత్ర నిర్వహణలో ఆగమశాస్ర్తాల ప్రకారం ఎలాంటి లోపాలు లేకుండా నిత్యపూజలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయంలో ఎలాంటి హుండీలు, పూజా రుసుములు లేవని, పీఠం ఏజెంట్‌గా పిటిషనర్, అతని కుటుంబ సభ్యులు ఖర్చులు సమకూరుస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఎండోమెంట్‌శాఖ అసిస్టెంట్ కమిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. హంపీ విద్యారణ్య పీఠం సదరు ఆలయాన్ని దత్తత చేసుకున్నట్లు ప్రభుత్వం ధ్రువీకరించలేదని పేర్కొన్నారు. సొంతంగా బండి సంజయ్ పూర్తిస్థాయు నిర్వాహకుడిగా ఉన్నారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. కేవలం హుండీలు, రుసుములు లేనంత మాత్రాన ప్రజల మతపరమైన సంస్థ ప్రైవేటు సంస్థ కాబోదని.. ఎండోమెంట్ చట్టం అన్ని హిందూమతపరమైన సంస్థలకు వర్తిస్తుందని స్పష్టంచేసింది. చట్టంలోని సెక్షన్ 154 ప్రకారం ఆ ఆలయానికి మినహాయింపు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని పేర్కొంటూ అసిస్టెంట్ కమిషనర్ ఇచ్చిన నోటీసును కొట్టేసింది.