Share News

Telangana Elections: సమరానికి సై

ABN , Publish Date - Sep 30 , 2025 | 05:14 AM

కొద్ది నెలలుగా రాజకీయ వర్గాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది! స్థానిక సమరానికి రంగం సిద్ధమైంది! స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది! జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం....

Telangana Elections: సమరానికి సై

  • స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూలు ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం

  • రెండు దశల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు

  • అక్టోబరు 23, 27న పోలింగ్‌.. నవంబరు 11న ఫలితాలు

  • పంచాయతీ సర్పంచ్‌, వార్డు సభ్యులకు మూడు దశల్లో

  • వీటికి పోలింగ్‌ రోజే ఫలితాలు.. రాష్ట్రంలో అమల్లోకి కోడ్‌

  • ప్రభుత్వ గెజిట్‌ ఆధారంగా షెడ్యూల్‌: రాణి కుముదిని

హైదరాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కొద్ది నెలలుగా రాజకీయ వర్గాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది! స్థానిక సమరానికి రంగం సిద్ధమైంది! స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది! జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) షెడ్యూల్‌ను ప్రకటించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీలకు రెండు (అక్టోబరు 23, 27 తేదీలు) దశల్లో, సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు మూడు (అక్టోబరు 31, నవంబరు 4, 8వ తేదీల్లో) దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ అక్టోబరు 9న ప్రారంభమై.. నవంబరు 11న ముగియనుంది. సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు పోలింగ్‌ రోజునే ఓట్లు లెక్కించి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు మాత్రం నవంబరు 11న ఓట్లను లెక్కించి, ఫలితాలను ప్రకటించనున్నారు. ఇక, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) జూలై 15వ తేదీ వరకు సిద్ధం చేసిన ఓటర్ల తుది జాబితా ఆధారంగా పంచాయతీ, వార్డుల వారీగా డీపీవోలు, ఎంపీడీవోల ద్వారా పరిశీలన జరుపుతారు. కాగా, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పార్టీ గుర్తులతోనే ఎన్నికలను నిర్వహిస్తారు. సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికలు మాత్రం పార్టీరహితంగా చేపడతారు. ఇందుకు అనుగుణంగా ఎస్‌ఈసీ ఎన్నికల సామగ్రిని ఇప్పటికే సిద్ధం చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కేటాయించాల్సిన గుర్తులు, బ్యాలెట్‌ పత్రాలను ఇప్పటికే ముద్రించారు. స్థానికంగా వచ్చే నామినేషన్ల ఆధారంగా ఆయా గుర్తులను అభ్యర్థులకు కేటాయిస్తారు.


ప్రభుత్వ గజిట్‌ ఆధారంగా షెడ్యూల్‌: రాణి కుముదిని

రాష్ట్రంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌, వార్డు సభ్యుల ఖాళీల పరిధిలో ఎన్నికలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదిని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన గజిట్‌ నోటిఫికేషన్‌ ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారు చేశామని వెల్లడించారు. ఎస్‌ఈసీ కార్యాలయంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌, ఆ శాఖ డైరెక్టర్‌ సృజన, పోలీసు ఉన్నతాధికారులతో కలిసి సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘అక్టోబరు 9 నుంచి నవంబరు 11 వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం అందజేసిన ఓటరు జాబితాను ఆధారంగా చేసుకొని తుది ఓటర్ల జాబితాను గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా ఇప్పటికే ప్రకటించాం. విడతల వారీగా చేపట్టే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ చేసే రోజు నుంచే ఆ విడత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. పోలింగ్‌ పూర్తయిన తర్వాత అదే రోజు పంచాయతీల ఓట్ల లెక్కింపు చేపడతాం’’ అని వివరించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎక్కడా అడ్డంకులు లేకుండా సమర్థంగా నిర్వహించేలా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటామని తెలిపారు.

ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలుంటే అనర్హులు

స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు కంటే ఎక్కువమంది పిల్లలుంటే అనర్హులనే విఽధానం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. అయితే, ఈ ఎన్నికల్లో దానికి సడలింపు ఇస్తారని ఆశావహులు భావించినా..ప్రభుత్వం ఏ నిర్ణయం ప్రకటించలేదు. దీంతో ఈ ఎన్నికల్లో ఇద్దరి కన్నా ఎక్కువమంది పిల్లలున్నవారు పోటీకి అనర్హులేనని సంబంధిత విభాగాలు వెల్లడించాయి. ఎక్కువ మంది పిల్లల నిబంధనను ఏపీలో ఇటీవల ఎత్తివేశారు.

Updated Date - Sep 30 , 2025 | 05:52 AM