Thummala : త్వరలో నేతన్నలకు 33 కోట్ల రుణమాఫీ
ABN , Publish Date - Aug 27 , 2025 | 04:57 AM
రైతులకు రుణమాఫీ చేసినట్లే నేత కార్మికుల రుణాలను క్యాబినెట్‌లో చర్చించి త్వరలోనే మాఫీ చేస్తామని చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
స్వశక్తి మహిళలకు రెండు చీరల చొప్పున అందిస్తాం: తుమ్మల
సిరిసిల్ల, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): రైతులకు రుణమాఫీ చేసినట్లే నేత కార్మికుల రుణాలను క్యాబినెట్‌లో చర్చించి త్వరలోనే మాఫీ చేస్తామని చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ముఖ్యమంత్రి నేతన్నలకు సంబంధించి రుణమాఫీ చేయడానికి నివేదిక తయారు చేయాలని సూచించిన మేరకు రూ.33 కోట్లు రుణాలు ఉన్నట్లు లెక్కలు తేలాయని తెలిపారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నేతన్న పొదుపు(త్రిఫ్ట్), నేతన్న బీమా పథకాల చెక్కులను పంపిణీ చేశారు.
ఇదే సందర్భంలో దసరాకు స్వశక్తి మహిళలకు అందించే ఏకరూప చీరలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జౌళి శాఖ కార్యదర్శి శైలజారామయ్యర్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. మహిళలు గౌరవంగా స్వీకరించేలా నాణ్యమైన చీరలు అందిస్తామన్నారు. ఒక్క చీరపై రూ.480 ఖర్చు చేస్తూ 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు రెండు చీరలు చొప్పున పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గంలో గతంలో ఏం జరిగిందో.. ఇప్పుడు ఏం జరుగుతుందో గమనించాలన్నారు.