Land Dispute: 11 గుంటల భూమి.. ప్రాణాల మీదికి తెచ్చింది
ABN , Publish Date - Sep 01 , 2025 | 04:53 AM
దాయాదుల మధ్య భూవివాదం ప్రాణాల మీదకు తెచ్చింది. ఓ వర్గం మరో వర్గంపై గొడ్డళ్లు, కత్తులతో దాడికి తెగబడింది. ఈ దాడిలో ఓ యువకుడు మరణించగా, అతని భార్య, సోదరుడి దంపతులు, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
భూ వివాదంతో దాయాదుల మధ్య గొడవలు.. గొడ్డళ్లు, కత్తులతో దాడికి తెగబడిన ఓ వర్గం
యువకుడి మృతి.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు, ఒకరికి సీరియస్
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): దాయాదుల మధ్య భూవివాదం ప్రాణాల మీదకు తెచ్చింది. ఓ వర్గం మరో వర్గంపై గొడ్డళ్లు, కత్తులతో దాడికి తెగబడింది. ఈ దాడిలో ఓ యువకుడు మరణించగా, అతని భార్య, సోదరుడి దంపతులు, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధి దండుమైలారం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో అన్నదమ్ములు గుడేటి నర్సింహ, యాదయ్య, మల్లయ్య, జంగయ్యలకు 18.12 ఎకరాల భూమి ఉంది. ఒక్కొక్కరి వాటాగా 4.23 ఎకరాల భూమి ఉండాలి. కాని నర్సింహ, యాదయ్యలకు ఉండాల్సిన దానికన్నా 11 గుంటల భూమి ఎక్కువ ఉంది. కొంతకాలం క్రితం యాదయ్య మృతిచెందగా వివాదం దాయాదులైన వారి కుమారుల వరకు వెళ్లింది. అదనంగా ఉన్న భూమి తమకు చెందాలని మల్లయ్య, జంగయ్యల కుమారులు అడుగుతూ వస్తున్నారు. దీనికి నర్సింహ, యాదయ్యల కుమారులు ఒప్పుకోకపోవడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. గత ఏడాది పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు.
దీంతో వివాదాస్పద భూమిలోకి ఎవరూ వెళ్లొద్దని ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆదేశాలు జారీ చేశారు. దానిని అతిక్రమించి నర్సింహ, యాదయ్య కుటుంబీకులు ఆదివారం ఆ భూమిలో వరినాట్లు వేస్తుండగా మల్లయ్య కుమారులు బాల్‌రాజ్, అతని భార్య పావని, సోదరుడు పర్వతాలు, అతని భార్య మంజుల, జంగయ్య కుమారులు ధన్‌రాజ్, వెంకట్ అడ్డుపడ్డారు. దీంతో వారిపై నర్సింహ, యాదయ్య కుటుంబీకులు గొడ్డళ్లు, కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో బాల్‌రాజ్(37) తీవ్రంగా గాయపడగా ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన పావని, పర్వతాలు, మంజుల, వెంకట్‌లను ఇబ్రహీంపట్నంలోని లిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. మంజుల పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఓ వర్గానికి చెందిన 9 మందిపై కేసులు నమోదు చేశారు. మృతుడు బాల్‌రాజ్ వర్గం ఈ దాడి వెనుక ఓ కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడని, అతనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మరో వర్గంలో కూడా ఐదుగురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.