Water Resources: రెండేళ్లలో పాలమూరు పూర్తి
ABN , Publish Date - May 02 , 2025 | 05:50 AM
నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రాజెక్టుల నిర్మాణం పై ప్రాధాన్యమిస్తున్నామని, భూసేకరణ సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను 2027లో పూర్తి చేయాలని మంత్రి తెలిపారు.
ఏడాదిలోగా కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్
3 నెలల్లోపు నార్లాపూర్-ఏదుల లింక్
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్
(నార్లాపూర్ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
భూముల విలువలు పెరగడం, ప్రాజెక్టులకు భూములు ఇవ్వడానికి రైతాంగం మందుకు రాకపోవడంతో భూసేకరణ క్లిష్టతరంగా మారిందని నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. భూముల సేకరణ తగ్గించుకుంటూ ప్రాజెక్టుల నిర్మాణానికే ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. మూడు నెలల్లోపు నార్లాపూర్-ఏదుల లింక్ పనులను పూర్తిచేసి, పాలమూరు రిజర్వాయర్‌లలో 50 టీఎంసీల నీటిని నిల్వ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. గురువారం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం రిజర్వాయర్లు, పంప్‌హౌ్‌సల నిర్మాణ పనుల పురోగతిని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ప్రణాళిక సంఘం వైస్‌ఛైర్మన్ చిన్నారెడ్డి, ఎత్తిపోతల పథకం సలహాదారు పెంటారెడ్డి, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డిలతో కలిసి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పరిశీలించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, జవహార్ నెట్టెంపాడు, రాజీవ్ బీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను ఏడాదిలోగా పూర్తి చేస్తామని వెల్లడించారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని 2027 డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని చెప్పారు.
తొలుత నార్లాపూర్‌కు చేరుకున్న ఆయన నార్లాపూర్ పంపింగ్ స్టేషన్‌తో పాటు 6.4 టీఎంసీల సామర్థ్యం కలిగిన నార్లాపూర్ రిజర్వాయర్‌ను, ఆ తర్వాత పాలమూరు-రంగారెడ్డిలో ప్యాకేజీ-3లో ఓపెన్ కెనాల్ పనులను పరిశీలించారు. మూడు నెలల్లోగా లింక్‌ను పూర్తిచేయాలని అన్నారు. ఏ మాత్రం లాభసాటి కాకున్నా పనులు చేస్తున్నామని కాంట్రాక్టర్ చెప్పగా, గిట్టుబాటు కోసం మరో పని అప్పగిస్తామని, ఈలోగా కెనాల్ పనులు సత్వరం చేపట్టాలని కాంట్రాక్టర్‌కు హామీ ఇచ్చారు. ఆ తర్వాత వనపర్తి జిల్లాలోని ఏదుల రిజర్వాయర్‌తో పాటు తీగలపల్లి పంప్‌హౌ్‌సను పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. 6.5 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌లో నీటిని పంపింగ్ చేయడానికి వీలుగా ఒక్కోటి 145 మెగావాట్ల సామ ర్థ్యం కలిగిన 10 మోటార్లున్న దేశంలోనే అతిపెద్ద భూగర్భ పంప్‌హౌ్‌సను పరిశీలించారు. ఆ తర్వా త బిజినేపల్లి మండలం వట్టెంలోని పంపింగ్‌స్టేషన్, రిజర్వాయర్‌ను పరిశీలించారు. గత సీజన్‌లో వ రదలకు వట్టెం పం్‌ప్‌హౌస్ మునగగా డీవాటరింగ్, మోటార్ల డ్రైరన్‌లను పరిశీలించారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్‌లలో 50 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి వీలుగా ఉన్న ప్రతిబంధకాలన్నీ తొలగించాలని అధికారులను ఆదేశించారు. 2026మార్చిలోగా ఉద్ధండపూర్ జలాశయం పూర్తిచేసి, నీటిని నిల్వ చేస్తామని ప్రకటించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని ఎల్లూరు (కల్వకుర్తి రిజర్వాయర్)లోకి తరలించి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం హెడ్ రెగ్యులేటరీ నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. ఈపథకం పూర్తి చేయడానికి అవసరమైన నిధులు, భూసేకరణ వంటి వివరాలతో ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. నార్లాపూర్‌తో పాటు వివిధ పంప్‌హౌ్‌సలకు కరెంట్ కనెక్షన్ ఇవ్వడానికి వీలుగా సబ్ స్టేషన్ల నిర్మాణాల కోసం ట్రాన్స్‌కోకు రూ.262కోట్లను చెల్లించినట్లు వెల్లడించారు.
కృష్ణా జలాల్లో బీఆర్‌ఎస్ రాజీ
ప్రాజెక్టుల పరిశీలన అనంతరం నాగర్‌కర్నూల్‌లో విలేకరులతో మాట్లాడిన ఉత్తమ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల నీటిని కేటాయించగా, అందులో 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు కేటాయించాలని బీఆర్‌ఎస్ కోరిందని విమర్శించారు. 2015లో జరిగిన ఈ ఒప్పందం 2022-23 దాకా అమలయిందని, బీఆర్‌ఎస్ రాజీ ధోరణితో ఏపీ 511 టీఎంసీలను వినియోగించుకుందని అన్నారు. అంతేకాకుండా పలు వేదికల్లో ఈ ఒప్పందాన్ని ప్రస్తావిస్తోందని ఆక్షేపించారు.
సొరంగంలో చిక్కుకున్న ఆరు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌లో చిక్కుకుపోయిన 6 కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం మంజూరు చేసిందని, ఆయా కుటుంబాలకు పరిహారం చెల్లిస్తామని మంత్రి ప్రకటించారు. టన్నెల్‌లో 50 మీటర్ల ప్రాంతం అత్యంత ప్రమాదకరమని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెచ్చరికలతో మున్ముందు సహాయక చర్యలు ఏ విధంగా అమలు చేయాలనే దానిపై సాంకేతిక కమిటీని వేశామని, ఆ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
ఇవి కూడా చదవండి
ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం
PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు
Read Latest AP News And Telugu News