Alcohol Ban: కల్తీసారా తాగిన వారి వీసాలు రద్దు
ABN , Publish Date - Aug 20 , 2025 | 04:46 AM
మద్య నిషేధం అమలులో ఉన్న కువైత్‌లో కల్తీ సారా కలకలం కొనసాగుతోంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కువైత్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.
దేశ బహిష్కరణకు కువైత్ నిర్ణయం
మళ్లీ రాకుండా జీవితకాల నిషేధం
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): మద్య నిషేధం అమలులో ఉన్న కువైత్‌లో కల్తీ సారా కలకలం కొనసాగుతోంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కువైత్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ దుర్ఘటన అనంతరం భారతీయులు, ఇతర విదేశీ కార్మికులు నివసిస్తున్న ప్రాంతాల్లో పోలీసులు రేయింబవళ్లు తనిఖీలు చేస్తున్నారు. వీసా, ఇంటి చిరునామాలో ఎలాంటి లొసుగులు కనిపించినా అరెస్టు చేసి జైలుకు తరలిస్తున్నారు. దీంతో ఇక్కడ ప్రవాసాంధ్రులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. కల్తీ సారాతోపాటు వ్యభిచారం, ఇతర నేరాలకు నెలవైన జ్లీబ్ అల్ శూయుఖ్ అనే ప్రాంతాన్ని పూర్తిగా నేలమట్టం చేసి, దాన్ని పునర్నిర్మించే ప్రతిపాదనను కూడా కువైత్ ప్రభుత్వం పరిశీస్తోంది. 8 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న ఈ ప్రాంతం అనేక నేరాలకు అడ్డాగా మారింది.
ఇక్కడ ప్రవాసాంధ్ర కార్మికులు, ఇతర భారతీయులు, బంగ్లాదేశీయులు నివసిస్తున్నారు. కల్తీ సారా సేవించి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న భారతీయులతో సహా విదేశీయులందరూ కోలుకున్న అనంతరం వారందరి వీసాలు రద్దు చేసి దేశ బహిష్కరణ విధించడంతో పాటు వారు జీవితంలో మళ్లీ తమదేశంలో అడుగు పెట్టకుండా నిషేఽధించాలని కువైత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇస్లామిక్ చట్టం అమలులో ఉన్న కువైత్‌లో సారా విక్రయం, వినియోగం నిషేధం. దీన్ని ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు కువైత్ అధికారులు ప్రకటించారు. కల్తీ సారా తాగిన వారిలో 40 మంది భారతీయులు సహా మొత్తం 160 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.