Share News

ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు

ABN , Publish Date - Jan 18 , 2025 | 04:44 AM

విశాఖ స్టీలు ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా పరిరక్షించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని, దాన్ని లాభాల బాటలోకి మళ్లిస్తామని ఉక్కుశాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి అన్నారు.

ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు

విశాఖ ఉక్కును నంబర్‌ 1గా తీర్చిదిద్దుతాం.. బాబు ప్రయత్నాలతోనే పునరుద్ధరణ

  • లాభాల్లోకి తేవాలనే ఆర్ధిక సాయం

  • ఆగస్టులో 3వ బ్లాస్ట్‌ ఫర్నే్‌సలో ఉత్పత్తి

  • ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి వెల్లడి

న్యూఢిల్లీ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : విశాఖ స్టీలు ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా పరిరక్షించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని, దాన్ని లాభాల బాటలోకి మళ్లిస్తామని ఉక్కుశాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. ఇందులోభాగంగానే, కేంద్ర కేబినెట్‌ రూ. 11,440 కోట్ల భారీ సాయం ప్రకటించిందని తెలిపారు. విశాఖ ఉక్కు ప్లాంట్‌ పునరుద్ధరణకు ఈ నిధులను వినియోగించడం జరుగుతుందని కుమారస్వామి వివరించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను దేశంలోనే నంబర్‌ వన్‌ ప్లాంట్‌గా మార్చడాన్ని ఒక సవాలుగా తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఏడునెలలుగా ఎన్నో సార్లు ఈ ప్లాంట్‌ పునరుద్ధరణ గురించి చర్చించారని, ఒక దశలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో తాను, చంద్రబాబు అర్ధరాత్రి రెండు గంటలవరకు చర్చించామని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ ఎంతో ఉదారంగా వ్యవహరించారని చెప్పారు. విశాఖ ఉక్కు పునరుద్ధరణలో భాగంగా ఇది కేబినెట్‌ మంజూరుచేసిన తొలి ప్యాకేజీ మాత్రమేనని, తదుపరి దశల్లో కూడా నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.


ప్రస్తుత ప్యాకేజీలో భాగంగా రూ. 10,300 కోట్లు ఈక్విటీ మూలధనంగా ఉంటుందని, రూ. 1140 కోట్ల వర్కింగ్‌ కాపిటల్‌ రుణాన్ని నాన్‌ క్యూములేటివ్‌ ప్రిఫరెన్స్‌ షేర్‌ కాపిటల్‌గా మారుస్తామని కుమారస్వామి చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ ఉత్పత్తి ప్రారంభిస్తుందని ఆయన వెల్లడించారు. ‘‘గత ఏడాది అక్టోబరు 9న సీఎం చంద్రబాబుతో కలిసి నేను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశాను. రాత్రి రెండు గంటల వరకు సమావేశం జరిగింది. చివరకు నిర్మలా సీతారామన్‌ కొంత ఆర్థిక సహాయం చేసేందుకు అంగీకరించారు. తర్వాత ఎస్‌బీఐ క్యాప్‌ అధికారులతో ఒక కమిటీని వేశాం. ప్లాంటు పునరుద్ధరణపై మెకాన్‌ సంస్థ సలహా కూడా తీసుకున్నాం. ఆ తర్వాత మంత్రుల బృందం సమావేశమై పలు సలహాలు ఇచ్చింది. చివరకు రూ. 11,440 కోట్ల ప్యాకేజీ నిర్ణయమైంది’’ అని కేంద్ర ఉక్కుమంత్రి కుమారస్వామి వివరించారు. 93 శాతం సామర్థ్యాన్ని సాధించడాన్ని ఆర్థిక శాఖ తమకు లక్ష్యంగా విధించిందని, ఈ ఏడాది ఆగస్టు కల్లా దానిని సాధిస్తామని చెప్పారు. కాగా, ఇవే వివరాలతో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు.


కూటమి ‘ఉక్కు’ పట్టు

విశాఖపట్నం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, విశాఖ ఎంపీ శ్రీభరత్‌, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ తదితరులు విశాఖ ఉక్కు సమస్యను ఢిల్లీ పెద్దలకు తెలియజేసి భారీగా ఆర్థిక సాయం చేయాలని కోరారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే విశాఖపట్నం రప్పించారు. ఇక్కడి సమస్యలు చూపించారు.

Updated Date - Jan 18 , 2025 | 04:44 AM