Share News

KTR: చర్య తీసుకున్నాక నేను మాట్లాడేదేముంది?

ABN , Publish Date - Sep 09 , 2025 | 04:29 AM

పార్టీ నుంచి సోదరి కవిత సస్పెన్షన్‌పై ఎట్టకేలకు బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ స్పందించారు. పార్టీలో కీలకంగా చర్చించాకే ఆమెను సస్పెండ్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

KTR: చర్య తీసుకున్నాక నేను మాట్లాడేదేముంది?

  • పార్టీలో సమగ్రంగా చర్చించాకే కవితపై వేటు

  • ఉప రాష్ట్రపతి ఎన్నికలో బీఆర్‌ఎస్‌ ఓటెయ్యదు!

  • రైతుల కష్టాలు ప్రభుత్వాలు పట్టించుకోనందుకే

  • ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడాల్సిందే: కేటీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): పార్టీ నుంచి సోదరి కవిత సస్పెన్షన్‌పై ఎట్టకేలకు బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ స్పందించారు. పార్టీలో కీలకంగా చర్చించాకే ఆమెను సస్పెండ్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కవిత వ్యవహారంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, కేటీఆర్‌ ఎక్కడా ఆమె పేరు ప్రస్తావించకుండా సమాధానం ఇచ్చారు. ‘‘పార్టీ కీలకంగా సమావేశమై చర్చలు జరిపింది. తర్వాతనే సస్పెన్షన్‌ నిర్ణయం తీసుకుంది. ఒకసారి చర్యలు చేపట్టాక నేను మాట్లాడటానికి ఏమీ లేదు’’ అన్నారు. మంగళవారం జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పాల్గొనబోవడం లేదని కేటీఆర్‌ ప్రకటించారు. యూరియా కొరతపై 20 రోజుల కిందట హెచ్చరించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించ లేదని, వారి వైఖరికి నిరసనగా, 71 లక్షల మంది తెలంగాణ రైతన్నలకు సంఘీభావంగా ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. ఇరు కూటముల అభ్యర్థుల విషయంలో బీఆర్‌ఎస్‌ తటస్థంగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో భారీ స్థాయిలో డ్రగ్స్‌ పట్టుబడటం కాంగ్రెస్‌ నిర్లక్ష్య పాలనకు నిదర్శనమని అన్నారు. డ్రగ్స్‌లో ముఖ్యమంత్రికి ముడుపులు ముట్టడం వల్లే పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర పోలీసులు చర్లపల్లిలో డ్రగ్స్‌ పట్టుకుంటే సీఎంకు సమాచారమే లేదన్నారు.


ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఓ టీవీ చర్చలో పీసీసీ అధ్యక్షుడు స్వయంగా అంగీకరించారని, కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్‌లో చేరినట్లు అంగీకరించారని, ఇక విచారణ అక్కర్లేదని, స్పీకర్‌ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కోరారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఆదేశించిన రేవంత్‌రెడ్డి అదే కాళేశ్వరంప్రాజెక్టు ఆధారంగా నిర్మించిన మల్లన్నసాగర్‌ను మూసీ నదితో అనుసంధానం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నారని కేటీఆర్‌ ప్రస్తావించారు. రేవంత్‌ తలా తోక లేనోడని, నీళ్లు తేవాల్సిన తల దగ్గర కాకుండా తోకలాంటి గండిపేట వద్ద శంకుస్థాపన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. 16 వేల కోట్ల మూసీ సుందరీకరణ ప్రాజెక్టును లక్షన్నర కోట్లకు పెంచితే అడ్డుకున్నామని, అందుకే, విడతల వారీగా జనాల సొమ్ము దోచుకునేందుకే ఈ పథకాలను మొదలుపెట్టారని ఆరోపించారు. కొండ పోచమ్మ సాగర్‌ నుంచి హైదరాబాద్‌కు గోదావరి జలాలను తీసుకొచ్చే పథకం అంచనాలను రూ.1,100 కోట్ల నుంచి 7,390 కోట్లకు పెంచారని, మల్లన్నసాగర్‌ నుంచి నీళ్లు తెచ్చే విధంగా మార్పులు చేశారని చెప్పారు. రూ.4 వేల కోట్లతో నిర్మించిన మేడిగడ్డ బరాజ్‌లో కేవలం రూ.250 కోట్లు మాత్రమే ఖర్చయ్యే 7వ బ్లాక్‌లోని మూడు పిల్లర్ల రిపేర్లను తమ సొంత డబ్బులతో చేస్తామని నిర్మాణ కంపెనీ ఎల్‌ అండ్‌ టీ చెబుతోందని ప్రస్తావించారు.


ప్రజాధనం ఎక్కడ వృథా అవుతుందో రేవంత్‌ చెప్పాలన్నారు. ఉచిత మంచినీటి పథకాన్ని జీహెచ్‌ంఎసీ ఎన్నికల తర్వాత రద్దు చేస్తారని ఆరోపించారు. సుంకిశాల రిటైనింగ్‌ వాల్‌ కూలిన ఘటనకు కారణమైన కాంట్రాక్ట్‌ కంపెనీని బ్లాక్‌లిస్ట్‌ చేయాలని అధికారులు నివేదిక ఇచ్చినా అదే కంపెనీకి రేవంత్‌ వేల కోట్ల పనులు అప్పగిస్తున్నారని కేటీఆర్‌ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఆ కంపెనీని బ్లాక్‌ లిస్ట్‌ చేసిందన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలకు మూసీ సుందరీకరణ అప్పగించే ప్రయత్నాల్లో ఉన్నారని ఆరోపించారు. కంపెనీలకు మూసీ సుందరీకరణ అప్పగించే ప్రయత్నాల్లో ఉన్నారని ఆరోపించారు.

Updated Date - Sep 09 , 2025 | 04:29 AM