KTR: వారు గుండె దిగులుతో కాలం వెల్లదీస్తున్నారు.. కేటీఆర్ సెన్షేషనల్ ట్విట్
ABN , Publish Date - Jan 30 , 2025 | 08:52 AM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏడాది కాంగ్రెస్ పాలన..ఎదురుచూపుల పాలనగా మారిదంటూ మండిపడ్డారు.

Telangana: బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో సంతోషంగా ఉన్న రైతులు కాంగ్రెస్ ఏడాది పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అన్ని పధకాల కోసం రైతన్నలు ఎదురుచూపులు చూస్తున్నారని ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.
దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో రైతన్నలు దగాపడ్డారని, పదేళ్ల కేసీఆర్ పాలనలో వారు వెలుగులు నింపుకున్నారని, కానీ ఏడాది కాంగ్రెస్ పాలనలో అవన్నీ మటుమాయం అవుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలమూరులో పల్లికి మద్దతు ధరకోసం, వైరాలో మిర్చికి మద్దతు ధర కోసం, బయ్యారంలో కరంటు కోసం, జగిత్యాలలో యూరియా కోసం, భూమిని నమ్ముకుని ప్రపంచానికి బువ్వను అందించే రైతన్నలు నేడు పిడికిలెత్తి నిరసనలు చేస్తున్నరని సంచలన వ్యాఖ్యాలు చేశారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో వ్యవసాయం చేసిన రైతన్నలు.. నేడు ఏడాది కాంగ్రెస్ పాలనలో గుండె దిగులుతో కాలం వెల్లదీస్తున్నరన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలన.. ఎదురుచూపుల పాలనగా మారిందని సెన్షేషనల్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు ఈ కింది పధకాల కోసం ఎదురుచూస్తున్నారని కేటీఆర్ సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేశారు..
రైతుబంధు కోసం ఎదురుచూపులు
రైతుబీమా కోసం ఎదురు చూపులు
రుణమాఫీ కోసం ఎదురు చూపులు
కరంటు కోసం ఎదురుచూపులు
యూరియా కోసం ఎదురుచూపులు
సాగునీటి కోసం ఎదురుచూపులు
పంటల కొనుగోలు కోసం ఎదురు చూపులు
'ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ.. జాగో రైతన్న జాగో..జాగో తెలంగాణ జాగో.. 'అంటూ Xవేదికగా కాంగ్రెస్ పాలనపై మండిపడ్డారు.