Share News

KTR: ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై జ్యుడీషియల్‌ కమిషన్‌ వేయాలి : కేటీఆర్‌

ABN , Publish Date - Feb 26 , 2025 | 04:03 AM

ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో జ్యుడీషియల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

KTR: ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై జ్యుడీషియల్‌ కమిషన్‌ వేయాలి : కేటీఆర్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో జ్యుడీషియల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఒకవైపు సహాయక చర్యలు మరింత వేగవంతంగా కొనసాగిస్తూనే జరిగిన ప్రమాదంపై, అందుకు బాధ్యులైన వారిపైనా విచారణ చేపట్టాలని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదం వల్ల ప్రభుత్వానికి వందలకోట్ల నష్టం జరిగిందన్నారు. ఇంతకుముందు సుంకిశాల, పెద్దవాగు ప్రమాదాలు జరిగినపుడు కూడా ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేపట్టలేదని, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.


మరోవైపు.. దమ్ముంటే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి గెలిచి చూపించాలని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ నేతలు మాజీ జడ్పీటీసీ సభ్యుడు కీర్తి వెంకటేశ్వర్లు, మల్కిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు మంగళవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నుంచి వలసలు మొదలయ్యాయని, ఇందుకు స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి బీఆర్‌ఎ్‌సలో చేరికలే సాక్ష్యమని చెప్పారు. రేవంత్‌రెడ్డి చేతకానితనం వల్ల 48 గంటల్లో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఈ మరణ మృదంగానికి ముఖ్యమంత్రిదే పూర్తి బాఽధ్యత అని ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ పేర్కొన్నారు.

Updated Date - Feb 26 , 2025 | 04:03 AM