KTR Case Dismissed: కేటీఆర్‌పై కేసులు కొట్టివేసిన హైకోర్టు
ABN , Publish Date - Apr 22 , 2025 | 05:03 AM
హైకోర్టు సోమవారం కేటీఆర్‌పై నమోదైన మహదేవ్‌పూర్, ఉట్నూరు పోలీసు కేసులను కొట్టివేసింది. కేసు చెల్లవని, సంబంధిత నోటిఫికేషన్ లేని కారణంగా ధర్మాసనం నిర్ణయం తీసుకుంది
హైదరాబాద్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సోమవారం హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై మహదేవ్‌పూర్, ఉట్నూరు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులను కొట్టివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కాళేశ్వరం నీటిని వినియోగించడం లేదని ఆరోపిస్తూ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నేతలు గతేడాది జూలెలో మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళ్లారు. అనుమతి లేకుండా మేడిగడ్డ బ్యారేజీ పైకి రావడమే కాకుండా నిషేధిత ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టుపై డ్రోన్ కెమెరా ఎగురవేశారని నీటిపారుదలశాఖ అధికారుల ఫిర్యాదు చేశారు. దాంతో మహదేవ్‌పూర్ పోలీసులు కేటీఆర్‌తోపాటు మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణారెడ్డి, బాల్క సుమన్ తదితరులపై కేసు నమోదు చేశారు. దీనిని కొట్టివేయాలని కోరుతూ దాఖలైన క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. మేడిగడ్డ ప్రాంతం నిషేధిత జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి నోటిఫికేషన్ వెలువడలేదని, అందువల్ల కేసు చెల్లదని వాదించారు. దీంతో ఏకీభవిస్తూ ధర్మాసనం కేసును కొట్టేసింది. మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టులో రూ.25 వేల కోట్ల కుంభకోణం ఉందని కేటీఆర్ ఆరోపించడంపై కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఉట్నూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివిధ వర్గాల మధ్య శతృత్వం, రెచ్చగొట్టడం వంటి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. జరిగిన విషయానికి ఈ సెక్షన్లకు సంబంధం లేదని పేర్కొన్న ధర్మాసనం కేసును కొట్టేసింది.
రాజాసింగ్‌పై కేసు కూడా..
కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎ్‌స ప్రభాకర్ తదితరులపై నమోదైన కేసును హైకోర్టుకొట్టేసింది. కోవిడ్ నిషేధం అమలులో ఉండగా జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద ధర్నా చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు ఎలాంటి ఆధారాలు లేవంటూ హైకోర్టు కేసు కొట్టివేసింది. కాగా, లగచర్లలో భూసేకరణ విచారణ కోసం వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై దాడికి పాల్పడ్డ ఘటనలో బొమ్రా్‌సపేట పోలీసులు కొందరు రైతులపై నమోదు చేసిన రెండు అదనపు ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేసింది.