Share News

విచారణ వేళ హైటెన్షన్‌

ABN , Publish Date - Jun 17 , 2025 | 04:04 AM

కేటీఆర్‌ విచారణ సందర్భంగా ఏసీబీ ప్రధాన కార్యాలయం, పరిసర ప్రాంతాల్లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. తెలంగాణ భవన్‌, ఏసీబీ కార్యాలయానికి మధ్యలో కమాండ్‌కంట్రోల్‌ సెంటర్‌ ఉండడంతో..

విచారణ వేళ హైటెన్షన్‌

  • ఏసీబీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

  • నిలోఫర్‌ కేఫ్‌ను మూసివేయించిన పోలీసులు

  • బీఆర్‌ఎస్‌ ఆఫీసుకు బయట నుంచి తాళం

  • అదే సమయంలో కమాండ్‌ కంట్రోల్‌కు సీఎం

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): కేటీఆర్‌ విచారణ సందర్భంగా ఏసీబీ ప్రధాన కార్యాలయం, పరిసర ప్రాంతాల్లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. తెలంగాణ భవన్‌, ఏసీబీ కార్యాలయానికి మధ్యలో కమాండ్‌కంట్రోల్‌ సెంటర్‌ ఉండడంతో.. అక్కడ భారీగా పోలీసు బలగాలను మోహరించారు. విచారణకు వెళ్లే ముందు కేటీఆర్‌.. తనను ప్రభుత్వం అరెస్టు చేసే అవకాశం ఉందని చెప్పడంతో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు పెద్ద ఎత్తున చేరుకున్నారు.


మరోవైపు.. మధ్యాహ్నం 2 గంటలకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి మంత్రులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించడంతో అక్కడ హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. అప్పటికే అక్కడి నిలోఫర్‌ కేఫ్‌ వద్ద బీఆర్‌ఎస్‌ శ్రేణులు తిష్ఠ వేయడంతో పోలీసులు దాన్ని మూసివేయించారు. అలాగే.. తెలంగాణ భవన్‌కు తాళం వేశారు. విచారణకు వచ్చిన కేటీఆర్‌ వాహనాన్ని ఏసీబీ కార్యాలయంలోనికి అనుమతించిన పోలీసులు.. పార్టీ శ్రేణుల వాహనాల్ని కొంత దూరంలో అడ్డుకుని వెనక్కి తిప్పిపంపారు.

Updated Date - Jun 17 , 2025 | 04:04 AM