Fire Incident: రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. బోగిలో చెలరేగిన మంటలు
ABN , Publish Date - Aug 08 , 2025 | 07:51 AM
Fire Incident: గురువారం మొబైల్ రెస్ట్ బోగి లూప్‌లైన్‌లో నిలిచి ఉంది. ఏమైందో ఏమో తెలీదు కానీ, ప్రమాదవశాత్తు బోగిలో మంటలు చెలరేగాయి. మంటలు అంటుకున్న సమయంలో బోగిలో ముగ్గురు ఉద్యోగులు ఉన్నారు.
మహబూబాబాద్ కేసముద్రం రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొబైల్ రెస్ట్ బోగిలో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. డోర్నకల్-కాజీపేట మధ్య 3వ రైలు నిర్మాణ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. నిర్మాణ పనుల్లో భాగమైన ఉద్యోగుల కోసం కేసముద్రం రైల్వే స్టేషన్‌లో మొబైల్ బోగిని ఏర్పాటు చేశారు. గురువారం మొబైల్ రెస్ట్ బోగి లూప్‌లైన్‌లో నిలిచి ఉంది. ఏమైందో ఏమో తెలీదు కానీ, ప్రమాదవశాత్తు బోగిలో మంటలు చెలరేగాయి.
మంటలు అంటుకున్న సమయంలో బోగిలో ముగ్గురు ఉద్యోగులు ఉన్నారు. మంటల్ని గమనించిన వారు వెంటనే బయటకు వచ్చారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. ఒక వేళ ఈ సంఘటన అర్థరాత్రి వారు నిద్రమత్తులో ఉన్నపుడు జరిగి ఉన్నా.. డోరు సరైన సమయానికి ఓపెన్ కాకపోయి ఉన్నా పెను విషాదం చోటుచేసుకుని ఉండేది. సరైన సమయంలో అగ్ని ప్రమాదాన్ని గుర్తించి వారు బయటపడ్డారు. ఇక, మంటల్లో ఆ బోగి కాలిపోయింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటనపై విచారణ చేస్తున్నారు.
తరచుగా అగ్ని ప్రమాదాలు
ఈ మధ్య కాలంలో రైలులు తరచుగా అగ్ని ప్రమాదానికి గురవుతూ ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం తిరుపతి రైల్వే యార్డులో అగ్ని ప్రమాదం సంభవించింది. హిస్సార్-తిరుపతి మధ్య నడిచే వారాంతపు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలును చింతలచేను సమీపంలో పార్కింగ్ చేస్తుండగా చివరి నుంచి రెండో బోగీలో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటి తర్వాత పక్కనే నిలిచి ఉన్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ జనరేటర్ బోగికి కూడా మంటలు వ్యాపించాయి. దాని పెయింట్ కాలిపోయింది. హిస్సార్-తిరుపతి రైలు బోగి పూర్తిగా కాలిపోయింది.
ఇవి కూడా చదవండి
నగరంలో వర్ష బీభత్సం.. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్
ఆల్‌టైం గరిష్ఠానికి పసిడి ధరలు.. ఎంతకు చేరుకున్నాయంటే..