Koppula Eshwar: టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:37 AM
బీఆర్‌ఎ్‌సకు అనుబంధంగా సింగరేణిలో పనిచేస్తున్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షుడిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికయ్యారు.
ఎమ్మెల్సీ కవిత స్థానంలో.. ఆమె దేశంలో లేని సమయంలో ఎన్నిక
సంఘం నుంచి జాగృతి నేతల తొలగింపు
ఎన్నిక అప్రజాస్వామికం: సింగరేణి జాగృతి
గోదావరిఖని/హైదరాబాద్, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎ్‌సకు అనుబంధంగా సింగరేణిలో పనిచేస్తున్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షుడిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన టీబీజీకేఎస్ కేంద్ర కార్యవర్గ సమావేశంలో ఈశ్వర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంవత్సర కాలంగా ఖాళీగా ఉన్న పదవికి ఈశ్వర్‌ను ఎన్నుకున్నామని టీబీజీకేఎస్ ప్రకటించింది. టీబీజీకేఎ్‌సకు సింగరేణి జాగృతిలో పనిచేస్తున్న వారికి ఎలాంటి సంబంధం లేదని సమావేశం తీర్మానించింది. టీబీజీకేఎ్‌సలో ఉంటూ జాగృతిలో పనిచేస్తున్న ఎల్ వెంకటేష్, నరేష్ నేతలను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటు టీబీజీకేఎ్‌సలో అటు జాగృతిలో జోడు సవారీ చేయడం కుదరదని, ఊగిసలాటలో ఉన్న వారు ఏదో ఒకవైపే నిలబడాలని సూచించింది. ‘సింగరేణి బచావో.. కాంగ్రెస్ హఠావో’ పేరిట సింగరేణిలో యాత్ర నిర్వహించాలని తీర్మానించింది.
ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ సింగరేణిలో కొత్త బొగ్గు బ్లాకుల సాధన, కార్మికుల ఆదాయ పన్ను రద్దు కోసం ఢిల్లీ కేంద్రంగా ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా, కొప్పుల ఈశ్వర్ ఎన్నిక అప్రజాస్వామికమని, కార్మిక సంఘం విధానాలకు, సంస్కృతికి భిన్నంగా ఆయనను ఎన్నుకున్నారని సింగరేణి జాగృతి పేర్కొంది. గతంలో టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా కొనసాగిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దేశంలో లేని సమయంలో ఈ ఎన్నిక నిర్వహించడం దివాలాకోరుతనమని విమర్శించింది. గౌరవాధ్యక్షుని ఎన్నిక మహాసభల్లో జరగాలని, కార్యవర్గ సమావేశాల్లో కాదని పేర్కొంది.
టీబీజీకేఎస్ కోశాధికారి రాజీనామా
పదేళ్ల పాటు టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న కవితను తప్పించి, ఉద్దేశపూర్వకంగా అవమానించారని, బీఆర్‌ఎస్ నిర్ణయానికి నిరసనగా టీబీజీకేఎస్ కేంద్ర కోశాధికారి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెంకట్ తెలిపారు. కవితకు మద్దతుగా తనతోపాటు పలువురు టీబీజీకేఎ్‌సకు రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. సర్వసభ్య సమావేశం నిర్వహించకుండా, తెలంగాణ భవన్‌లో కూర్చుని ఎన్నిక ఎలా జరుపుతారని ప్రశ్నించారు.