Konda Surekha: ప్రజారోగ్యంపై ఉదాసీనత వద్దు
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:22 AM
రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు ఫార్మా, బల్క్ డ్రగ్స్ కంపెనీలు ప్రమాణాలు పాటించాలని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.
ఫార్మా, బల్క్ డ్రగ్ కంపెనీలపై నిఘా ఉంచాలి: మంత్రి సురేఖ
హైదరాబాద్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు ఫార్మా, బల్క్ డ్రగ్స్ కంపెనీలు ప్రమాణాలు పాటించాలని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఉన్నతాధికారులతో సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, పర్యావరణ హితానికి అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. ఫార్మా, బల్క్ డ్రగ్ పరిశ్రమలకు అనుమతుల విషయంలో అవకతవకలపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో అధికారుల తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఊరుకునేది లేదని అధికారులకు స్పష్టం చేశారు.
అవసరమైతే ప్రభుత్వం తరఫున టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. కాలుష్య నియంత్రణ ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని... అందుకు సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించారు. కాగా పీసీబీ ఉన్నతాధికారులతో తాను నిర్వహిస్తున్న సమీక్షకు కంపెనీల ప్రతినిధులు కాకుండా చిన్నా, చితక ఉద్యోగులు హాజరు కావడం పట్ల మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీలకు అనుమతుల్లో ఉదాసీనత సరికాదని పీసీబీ అధికారులను మంత్రి హెచ్చరించారు.