Share News

Konda Surekha: పీసీబీ అధికారుల తీరు బాగాలేదు

ABN , Publish Date - Aug 05 , 2025 | 05:01 AM

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)కి సంబంధించిన కీలక అంశాలపై కనీస సమాచారం అందడం లేదని మంత్రి కొండా సురేఖ ఆగ్రహంగా ఉన్నారు.

Konda Surekha: పీసీబీ అధికారుల తీరు బాగాలేదు

  • సీఎం రేవంత్‌కు మంత్రి కొండా ఫిర్యాదు

హైదరాబాద్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)కి సంబంధించిన కీలక అంశాలపై కనీస సమాచారం అందడం లేదని మంత్రి కొండా సురేఖ ఆగ్రహంగా ఉన్నారు. ఆ విభాగం ఉన్నతాధికారులే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. పీసీబీకి సంబంధించి ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహించిన సమయంలోనూ అధికారులు కనీస సమాచారం లేకుండా మొక్కుబడిగా హాజరవుతున్నారని.. సూచనలు, సలహాలు ఇస్తే వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారుల తీరుపై ఆమె నేరుగా సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కీలక అంశాలకు సంబంధించి తనకు సమాచారం ఇవ్వకుండా పీసీబీ అధికారులే ఫైళ్లు క్లియర్‌ చేసేసుకుంటున్నారని చెప్పినట్లు తెలిసింది.


కీలక నిర్ణయాలు, ఫైళ్లకు సంబంధించిన సమాచారం తన దృష్టికి తీసుకురావడం లేదని.. ఏవైనా అంశాలపై లేఖలు రాసినా అధికారులు వాటిని పక్కనబెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. అత్యంత కీలక ప్రభుత్వ విభాగాల్లో పీసీబీ ఒకటి కావడంతో బోర్డుకు సీఎస్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సీఎస్‌ అనుమతితోపాటు బోర్డులో చర్చ జరగాల్సి ఉంటుంది. అయితే, సీఎస్‌ రోజువారీ ప్రభుత్వ కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉండడంతో బోర్డు సమావేశాలకు హాజరవడం లేదని తెలుస్తోంది. సీఎస్‌ సమావేశాలు నిర్వహించకపోవడం, మంత్రికి సమాచారం ఇవ్వకపోవడంతో అసలు ఆ విభాగంలో ఏం జరుగుతోందనేది ప్రభుత్వానికి తెలియని పరిస్థితి నెలకొంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన మంత్రి సురేఖ అధికారుల తీరుపై సీఎంకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

Updated Date - Aug 05 , 2025 | 05:01 AM