Rajagopal Reddy: నియోజకవర్గానికి నిధులిస్తే చాలు
ABN , Publish Date - Aug 16 , 2025 | 04:20 AM
తనకు మంత్రి పదవి రాకున్నా పర్వాలేదని, తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులిస్తే చాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు.
మంత్రి పదవి ఇవ్వకున్నా పర్వాలేదు: రాజగోపాల్‌రెడ్డి
చౌటుప్పల్ రూరల్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): తనకు మంత్రి పదవి రాకున్నా పర్వాలేదని, తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులిస్తే చాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. నియోజకవర్గంలో సీసీ రోడ్డు కాంట్రాక్టర్లకు ఒక్క రూపాయి నిధులు కూడా రావడం లేదని, సంబంధిత మంత్రి వద్దకు వందసార్లు తిరిగినా నిధులు రాలేదని వాపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలో సర్దార్ వల్లభాయ్‌పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించాక రాజగోపాల్‌రెడ్డి ప్రసంగించారు.
కాంట్రాక్టర్లు రోడ్డు పనులు చేయడం లేదని, బిల్లులు చెల్లిస్తేనే చేస్తామంటున్నారని చెప్పారు. బిల్లు మాత్రం సీఎం చేతిలో ఉందన్నారు. తాను ముఖ్యమంత్రిని, పార్టీనీ విమర్శించడం లేదని, నియోజకవర్గానికి నిధులు ఇస్తే చాలన్నారు. తన పదవిపై అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పదవి వచ్చేటప్పుడే వస్తుందని, దానిని ఎవ్వరూ ఆపలేరని, ఆపితే తాను ఊరుకునే మనిషిని కాదన్నారు.