Share News

Komatireddy Rajagopal Reddy: అన్నదమ్ములమని మాట ఇచ్చినప్పుడు తెలియదా?

ABN , Publish Date - Aug 13 , 2025 | 05:17 AM

రేవంత్‌ రెడ్డికి సీఎం పదవి ఇచ్చినప్పుడు తమ అన్నదమ్ముళ్లకు మంత్రి పదవులిస్తే తప్పేంటని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని ప్రశ్నించారు.

Komatireddy Rajagopal Reddy: అన్నదమ్ములమని మాట ఇచ్చినప్పుడు తెలియదా?

  • రేవంత్‌ రెడ్డికి సీఎం పదవి ఇచ్చినప్పుడు.. మాకు మంత్రి పదవులిస్తే తప్పేంటి..?

  • అధిష్ఠానాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి

నల్లగొండ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రేవంత్‌ రెడ్డికి సీఎం పదవి ఇచ్చినప్పుడు తమ అన్నదమ్ముళ్లకు మంత్రి పదవులిస్తే తప్పేంటని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని ప్రశ్నించారు. తనను పార్టీలోకి ఆహ్వానించినప్పుడు.. మొన్నటి పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో రెండోసారి మాట ఇచ్చినప్పుడు తాము ఇద్దరమూ అన్నదమ్ములమని తెలియదా...? అని నిలదీశారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఎలగలగూడెంలో మంగళవారం గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో తనకు మంత్రి పదవి ఇవ్వాలనే అంశంపై మరోసారి వ్యాఖ్యలు చేశారు. ‘‘నాకు మంత్రి పదవి ఇవ్వడానికి సమీకరణాలు కుదరలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటున్నారు. ఏ సమీకరణలు కుదరలేదు.


మనసుంటే మార్గం ఉంటుంది. నాకు మంత్రి పదవి రాకుండా ఎవరు పుల్ల పెడుతున్నారు’’ అని ప్రశ్నించారు. వారి వ్యవహార శైలి ఒడ్డు దాటే వరకూ ఓడ మల్లయ్య, ఒడ్డు దాటాక బోడి మల్లయ్యలా ఉందని విమర్శించారు. ‘‘సమీకరణాలు కుదరలేదంటున్నారు. మరి, తొమ్మిదిమంది ఎమ్మెల్యేలున్న ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులుండగా, 11 మంది ఎమ్మెల్యేలున్న నల్లగొండకు ముగ్గురు మంత్రులుంటే తప్పా..?’’ అని ప్రశ్నించారు. తమ అన్నదమ్ముళ్లం తక్కువోళ్లమేం కాదని, ఇద్దరికీ ఇద్దరమేనని, గట్టి వాళ్లమేనని చెప్పారు.

Updated Date - Aug 13 , 2025 | 05:17 AM