Share News

Kishan Reddy: కాంగ్రెస్‌ ప్రభుత్వానిది దివాలాకోరుతనం

ABN , Publish Date - Mar 12 , 2025 | 04:28 AM

తెలంగాణలో కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హమీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాన చేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి మండిపడ్డారు.

Kishan Reddy: కాంగ్రెస్‌ ప్రభుత్వానిది దివాలాకోరుతనం

  • 7.5 లక్షల కోట్ల అప్పు ఉందని ఇప్పుడు తెలిసిందా..?..

  • లక్షన్నర కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరడం హాస్యాస్పదం

  • వైఫల్యాల నుంచి జనం దృష్టి మరల్చే యత్నం: కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హమీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాన చేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వనరులకు తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఇన్ని నెలల తర్వాత రూ.1.5 లక్షల కోట్లు కావాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం హాస్యాస్పదమన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రూ.3 లక్షల కోట్ల అప్పు మాత్రమే ఉందనుకున్నామని, ఇప్పుడు రూ.7.5 లక్షల కోట్లు ఉందని తెలిసిందని, అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతున్నామని చెప్పడం.. రాహుల్‌, రేవంత్‌, కాంగ్రెస్‌ అసమర్థతకు అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇప్పుడు కేంద్రాన్ని డబ్బులు అడగటం దివాళాకోరుతనమని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా దేశ, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కేంద్ర ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని తెలిపారు. తెలంగాణలో రీజినల్‌ రింగ్‌ రోడ్డును తప్పకుండా పూర్తి చేస్తామన్నారు. రైల్వే ప్రాజెక్టులకు ఇచ్చిన హామీ కంటే ఎక్కువ నిధులే కేటాయిస్తామని తెలిపారు. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ పనులు 65 శాతం పూర్తయ్యాయని చెప్పారు. రూ.750 కోట్ల వరకు బడ్జెట్‌ పెరిగే అవకాశం ఉన్నా, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఉత్పత్తి ప్రారంభిస్తామని వెల్లడించారు. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీకి భూమి పూజ చేసిన విషయం కూడా కాంగ్రెస్‌ ఎంపీలకు తెలియకుండా, దాని గురించి రైల్వే మంత్రికి మెమొరాండం ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు.


‘వూట్జ్‌.. ది ఫర్‌గాటెన్‌ మెటల్‌ క్రాఫ్ట్‌ ఆఫ్‌ డెక్కన్‌’ పుస్తకావిష్కరణ..

‘వూట్జ్‌.. ది ఫర్‌గాటెన్‌ మెటల్‌ క్రాఫ్ట్‌ ఆఫ్‌ డెక్కన్‌’ పుస్తకాన్ని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండు వేల ఏళ్ల కిందటే స్టీలు వంటి అద్భుతమైన లోహాల తయారీలో మన పూర్వీకులు ఎంతో ప్రావీణ్యం సంపాదించారని తెలిపారు. స్టీలు కన్నా శక్తిమంతమైన లోహమైన ‘వూట్జ్‌’ గురించి ప్రపంచానికి తెలియజేసేందుకు రచయిత జై కిషన్‌ శ్రీ పెరంబుదూరు చేసిన కృషిని ప్రశంసించారు. నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌లో ఈ లోహం ఒకప్పుడు అందుబాటులో ఉండేదని తన పరిశోధనలో వెల్లడైందని పుస్తకంలో పేర్కొన్నారని స్పష్టం చేశారు. ఈ లోహాన్ని వెలికితీసేందుకు జీఎ్‌సఐని ఆదేశిస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Mar 12 , 2025 | 04:28 AM